Share News

Yash Dayal-IPL2024: నా కొడుకుని దారుణంగా అవహేళన చేశారు.. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - May 20 , 2024 | 10:10 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు పేసర్ యశ్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ వేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆర్సీబీ నయా హీరోగా యశ్ దయాల్ మారిపోయాడు. అయితే ఐపీఎల్‌లో అతడి ప్రయాణం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. 2023లో దయాల్ కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు.

Yash Dayal-IPL2024: నా కొడుకుని దారుణంగా అవహేళన చేశారు.. ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు పేసర్ యశ్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ వేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆర్సీబీ నయా హీరోగా యశ్ దయాల్ మారిపోయాడు. అయితే ఐపీఎల్‌లో అతడి ప్రయాణం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. 2023లో దయాల్ కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ ప్లేయర్ ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌ తరపున ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సంచలన రీతిలో రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదింది యశ్ దయాల్ ఓవర్‌లోనే. ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు సమర్పించుకుంటే ఒక బౌలర్‌కు ఎలాంటి అవహేళనలు ఎదురవుతాయో వాటిని యశ్ దయాల్ ఎదుర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ అతడిని వదులుకుంది. దీంతో ఐపీఎల్ 2024కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ఇతడిని ఏకంగా రూ.5 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి యశ్ దయాల్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. ఆర్సీబీ తన డబ్బును వృథా చేసుకుందంటూ అవహేళన చేశారు. అయితే తన సత్తా ఏంటో యశ్ దయాల్ చూపించాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసి విమర్శకులకు తనపై ఉన్న అభిప్రాయం తప్పు అని నిరూపించుకున్నాడు.

కాగా 2023లో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ యశ్ దయాల్ తండ్రి చంద్రపాల్ ఐపీఎల్-2023లో తన కొడుకుకి ఎదురైన దారుణ పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఆ సీజన్‌లో యశ్ దయాల్ పేలవ ప్రదర్శన చేయడంతో తన కుటుంబం అవహేళనలు ఎదుర్కొందని, ట్రోలింగ్‌కు గురయ్యిందని గుర్తుచేసుకున్నాడు. ‘‘ఒక వాట్సాప్ గ్రూప్‌లో నాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఐదు సిక్సర్లు విషయంలో నా కొడుకుని ఎగతాళి చేస్తూ ఒక ఫొటో షేర్ చేశాడు. ప్రారంభం లేకుండానే ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ముగిసింది అని అతడు రాసుకొచ్చాడు’’ అని గుర్తుచేసుకున్నారు.

“ అవహేళనలు ఎదురైనప్పటికీ మేము ఆగిపోలేదు. మా కుటుంబానికి సంబంధించిన వాట్సప్ గ్రూప్ మినహాయించి అన్నింటి నుంచి వైదొలగాం. ఆర్సీబీ యశ్ దయాల్‌ని రూ.5 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు కూడా ‘ఫ్రాంచైజీ రూ.5 కోట్లను మురుగు కాలువలో పడేసింది’ అని ఎవరో అవహేళన చేశారు. సోషల్ మీడియాకు దూరమయినప్పటికీ అన్ని రకాల అంశాలను తెలుసుకునే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం” అని చంద్రపాల్ వ్యాఖ్యానించారు. కాగా ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు క్రీజులో ఉన్నప్పటికీ యశ్ దయాల్ చాలా కూల్‌గా బౌలింగ్ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - May 20 , 2024 | 10:10 PM