Virat Kohli: ఆర్సీబీని విరాట్ కోహ్లీ వీడాలి.. అప్పుడే అది సాధ్యమవుతుంది
ABN , Publish Date - May 23 , 2024 | 01:46 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని అదేం దరిద్రం పట్టుకుందో ఏమో తెలీదు కానీ.. ట్రోఫీని ముద్దాడాలని అనుకుంటున్న ఆ జట్టు కల గత 17 ఏళ్ల నుంచి కలగానే మిగిలిపోయింది. గతంలో మూడుసార్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుని అదేం దరిద్రం పట్టుకుందో ఏమో తెలీదు కానీ.. ట్రోఫీని ముద్దాడాలనుకుంటున్న ఆ జట్టు కల గత 17 ఏళ్ల నుంచి కలగానే మిగిలిపోయింది. గతంలో మూడుసార్లు ఫైనల్స్‌కి వెళ్లింది కానీ, ట్రోఫీని మాత్రం ప్రత్యర్థి జట్లు ఎత్తుకెళ్లిపోయాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ 10వ స్థానం నుంచి ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లడాన్ని చూసి.. ఈసారి కప్ కొట్టడం ఖాయమని అంతా భావించారు. తీరా చూస్తే.. ఎలిమినేటర్ దాకా వెళ్లి ఆ జట్టు నిష్క్రమించింది. దీంతో.. కప్ కొట్టాలన్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కల మళ్లీ కలగానే మిగిలింది.
Read Also: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ (Kevin Peterson) ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. కోహ్లీకి ఒక సలహా ఇచ్చాడు. తన కెరీర్‌లో ఐపీఎల్ ట్రోఫీని గెలుపొందాలంటే.. కోహ్లీ మరో ఫ్రాంచైజీలో చేరితే ఉత్తమమని సూచించాడు. ‘‘నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. క్రీడల్లో గొప్ప గొప్ప ఆటగాళ్లు తాము అనుకున్నది సాధించడం కోసం, తమ జట్లని వదిలి ఇతర జట్లలోకి వెళ్లారు. తన జట్టుకి కప్ సాధించి పెట్టాలని కోహ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ నెగ్గడంతో పాటు జట్టుకి ఎంతో చేసినా.. ఫ్రాంచైజీ మాత్రం మరోసారి విఫలమైంది. ఆ జట్టుతో కోహ్లీకి ఉన్న అనుబంధం, వాణిజ్య విలువల గురించి నేను అర్థం చేసుకోగలను. కానీ.. తనకు ట్రోఫీ తెచ్చిపెట్టే జట్టులో ఆడేందుకు కోహ్లీ అర్హుడు’’ అని అతను చెప్పుకొచ్చాడు.
Read Also: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?
ఇదే సమయంలో.. కోహ్లీ ఏ జట్టులో చేరితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సైతం కెవిన్ పీటర్సన్ పంచుకున్నాడు. ‘‘కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరితే బాగుంటుందని అనుకుంటున్నాను. పైగా కోహ్లీ ఢిల్లీకి చెందినవాడు. అతనికి ఢిల్లీలో ఇల్లు ఉంది కూడా! మరి.. అతను బెంగళూరుని వదిలి ఢిల్లీకి ఎందుకు వెళ్లట్లేదు అర్థం కావడం లేదు. ఆర్సీబీలాగే డీసీ కూడా ట్రోఫీ కొట్టాలని బలంగా కోరుకుంటోంది’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. కోహ్లీకి సుదీర్ఘంగా ఆలోచించే సమయం ఆసన్నమైందని తాను అనుకుంటున్నానని అన్నాడు. రొనాల్డో, మెస్సీ లాంటోళ్లే తమ జట్లని వదిలి వేరే జట్లలోకి వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. మరి.. కోహ్లీ వేరే ఫ్రాంచైజీలోకి వెళ్తాడా? లేక ఆర్సీబీతోనే కొనసాగుతాడా? అనేది చూడాలి.
Read Latest Sports News and Telugu News