Share News

Kapil Dev: అతడికి బీసీసీఐ సహాయం చేయాలి.. అవసరమైతే మా పెన్షన్ కూడా ఇచ్చేస్తాం.. కపిల్ దేవ్ లేఖ!

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:18 PM

భారతదేశానికి మొట్ట మొదటి సారి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు కపిల్ దేవ్ తాజాగా బీసీసీఐకి ఓ లేఖ రాశాడు. తమ సహచర ఆటగాడు, టీమిండియాకు రెండు సార్లు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన అన్షుమన్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, అతడికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

Kapil Dev: అతడికి బీసీసీఐ సహాయం చేయాలి.. అవసరమైతే మా పెన్షన్ కూడా ఇచ్చేస్తాం.. కపిల్ దేవ్ లేఖ!
Kapil Dev

భారతదేశానికి మొట్ట మొదటి సారి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు కపిల్ దేవ్ (Kapil Dev) తాజాగా బీసీసీఐ (BCCI)కి ఓ లేఖ రాశాడు. తమ సహచర ఆటగాడు, టీమిండియాకు రెండు సార్లు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన అన్షుమన్ గైక్వాడ్ (Anshuman Gaekwad) ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, అతడికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అవసరమైతే తమ పెన్షన్ డబ్బులను కూడా ఇచ్చేస్తామని తెలిపాడు. మాజీ క్రికెటర్లను ఆదుకునేందుకు బీసీసీఐ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాడు. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న అన్షుమన్ ఏడాది కాలంగా ఇంగ్లండ్‌లో చికిత్స అందుకుంటున్నాడు.


``అన్షుతో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. ప్రస్తుతం అతడి స్థితిని చూసి తట్టుకోలేకపోతున్నా. మైదానంలో భయంకర బంతులను ఎదుర్కొనేందుకు అన్షు ధైర్యంగా నిలబడిన సందర్భాలున్నాయి. మనం ఇప్పుడు అతడికి అండగా నిలబడాలి. అతడి చికిత్సకు అవసరమయ్యే డబ్బులు అందించేందుకు బీసీసీఐ సహాయం చేయాలి. సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, మదన్ లాల్, కీర్తి ఆజాద్, మొహిందర్ అమరనాథ్, నేను అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. మాజీ హెడ్ కోచ్‌కు సహాయం చేసేందుకు బీసీసీఐ కూడా ముందుకు వస్తే బాగుంటుంద``ని కపిల్ పేర్కొన్నాడు.


``ఇప్పటి తరం క్రికెటర్లు బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. కానీ, అప్పటి పరిస్థితి వేరు. మేం ఆడినపుడు బోర్డు దగ్గర తగినన్ని నిధులు ఉండేవి కావు. ఇప్పుడు బీసీసీఐ గొప్పగా ఎదిగింది. మాజీ క్రికెటర్ల సంరక్షణ కోసం బీసీసీఐ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది`` అని కపిల్ వ్యాఖ్యానించాడు. అన్షుమన్ గైక్వాడ్ కుటుంబ సభ్యులు అంగీకరిస్తే తమ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కపిల్ అన్నాడు. కాగా, అన్షుమాన్ గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్ట్‌లు, 15 వన్డేలు ఆడాడు.

ఇవి కూడా చదవండి..

IPL Prizemoney: ``జట్టు మొత్తం సంపాదన నీ జీతం కంటే తక్కువేగా అన్నాడు``.. ఐపీఎల్ ప్రైజ్‌మనీపై స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!


MS Dhoni: ``శ్రీశాంత్‌ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు``.. ధోనీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించిన అశ్విన్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2024 | 04:18 PM