Share News

IPL 2024 Final: కోల్‌కతా మురిసింది.. మూడోసారి టైటిల్ గెలిచింది..!

ABN , Publish Date - May 26 , 2024 | 10:54 PM

ఐపీఎల్-2024 టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ధోరణి ప్రదర్శించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను చిత్తుగా ఓడించింది.

IPL 2024 Final: కోల్‌కతా మురిసింది.. మూడోసారి టైటిల్ గెలిచింది..!
IPL 2024 Final

ఐపీఎల్-2024 టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ధోరణి ప్రదర్శించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టింది.


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన నిర్ణయం ఎంతో తప్పో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఇక, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ త్రిపాఠి (9), నితీష్ రెడ్డి (13), ఆదెల్ మార్‌‌క్రమ్ (20), షాబాజ్ అహ్మద్ (8), అబ్దుల్ సమద్ (4) వరుసగా వెనుదిరిగారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. హైదరాబాద్ టీమ్ 18.3 ఓవర్లలో 113 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్ 2, హర్షిత్ 2, అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.


114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఎలాంటి తడబాటూ లేకుండా బ్యాటింగ్ చేసింది. కోల్‌కతా బ్యాటింగ్ చూస్తే హైదరాబాద్ బ్యాటర్లు నిలబడలేకపోయిన పిచ్ అదేనా అని అనుమానం రాక మానదు. నరైన్ (6) త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ గుర్భాజ్ (32 బంతుల్లో 39) రాణించాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో కోల్‌కతా 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ చెరో వికెట్ తీశారు.

Updated Date - May 26 , 2024 | 10:54 PM