IND vs AUS: టీమిండియాను ఇబ్బంది పెడుతున్న ఒకే ఒక్కడు.. గంగూలీ గురి అతడిపైనే
ABN , Publish Date - Nov 18 , 2024 | 02:44 PM
తుది జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని గంగూలీ అన్నాడు. ఇక దానిపై చర్చించాల్సిన పని లేదంటూ తన ఆప్షన్ రివీల్ చేశాడు.
పెర్త్: ఆస్ట్రేలియాతో కీలక సిరీస్ ముంగిట టీమిండియాకు కొత్త చిక్కులు మొదలవనున్నాయి. ఇప్పటికే శుభ్ మన్ గిల్ గాయపడటం, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరంగా ఉండటం వంటివి భారత జట్టులో క్రికెటర్ల సంఖ్య రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా టీమిండియా కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పేస్ బౌన్స్ కలిగిన పెర్త్ పిచ్‌లో స్పిన్నర్లకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. అందువల్ల భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒకే ఒక్క స్పిన్నర్‌ను చేర్చుకునే అవకాశం ఉంది. అది రవీంద్ర జడేజానే అయ్యే అవకాశం ఉంది. అయితే పెర్త్ టెస్టులో ఆర్ అశ్విన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
‘‘అశ్విన్‌ను ఆడించాలా వద్దా అనే దానిపై ఎలాంటి చర్చ అవసరం లేదని, జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని గంగూలీ అన్నాడు. టెస్ట్ క్రికెట్ అనేది నిపుణుల కోసం. అశ్విన్ కంటే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మెరుగైన బ్యాట్స్‌మెన్ అన్నది నిజం. కానీ, జట్టులో ఈ అత్యుత్తమ స్పిన్నర్‌ను తొలి టెస్టులో ఆడించాలి. అదేవిధంగా, ప్లేయింగ్ ఎలెవన్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, బౌలర్ల అవసరం ఉంది. అందుకే తొలి టెస్టుకు అశ్విన్ నా ఎంపిక. ఆస్ట్రేలియా జట్టులో చాలా మంది ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉన్నందువల్ల అశ్విన్ రాణించగలడు’’ అని గంగూలీ తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ మెరుపులు మెరిపించలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ ఆడిన అశ్విన్ 10 వికెట్లు కూడా తీయలేకపోవడం భారత్ సిరీస్ ఓటమికి కూడా అద్దం పట్టింది. ఈ స్థితిలో పెర్త్ టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కకపోవచ్చని భావిస్తున్నారు. రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తాడని అంతా భావించారు.