BSNL 5G: 5జీ సిమ్ లాంఛ్ చేయనున్న బీఎస్‌ఎన్‌ఎల్.. ఆ నగర వాసులకు అందుబాటులోకి హై స్పీడ్ ఇంటర్నెట్!
ABN , Publish Date - Aug 05 , 2024 | 06:58 PM
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి.
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటు ధరల్లో సర్వీసులు అందించాలని భావిస్తోంది. 5జీ నెట్‌వర్క్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కాలింగ్ ఫీచర్లను అందించాలని బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తోంది (BSNL 5G SIM).
బీఎస్ఎన్ఎల్ 5జీని ఉపయోగించి ఇప్పటికే మొదటి కాల్ విజయవంతంగా చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ప్రారంభ కాల్ చేశారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రావచ్చు. మొదటగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత దేశమంతా విస్తరించనున్నాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సిమ్‌కార్డు అన్ బాక్సింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5జీ లేబుల్స్‌తో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాండ్ సిమ్ కార్డులు ఉన్న వీడియో అది. ఆ వీడియోను మహారాష్ట్రలోని ఓ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియో గురించి ఇప్పటివరకు బీఎస్‌ఎన్‌ఎల్ స్పందించలేదు.