Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:01 AM
నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
100 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆస్పత్రికి తరలింపు.. ముగ్గురు మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే
ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
మాగనూరు/ హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. మొత్తం 100 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కొందరిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లలో తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు.
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ముగ్గురు విద్యార్థులు మినహా మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, మాగనూరు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపి వారు తప్పు చేసినట్లు తేలితే సస్పెండ్ చేయాలని నారాయణపేట కలెక్టర్‌ను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాఽధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, విచారణ జరిపి.. తనకు నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. కాగా, బడుల్లో అధ్వాన భోజనం పెట్టి.. పేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ఆటలాడుతోందని హరీశ్‌రావు విమర్శించారు.