Share News

Kumaram Bheem Asifabad: త‘స్మార్ట్‌’ జాగ్రత్త

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:41 PM

పాతకాలంలో.. ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు.. బ్యాంకుల్లో అయితే భద్రం అని చెప్పేవారు. దీంతో ప్రజలు బ్యాంకులను నమ్మి అందులోనే పొదుపు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండడమే శాపంగా మారింది. బ్యాంకు ఖాతాలో లక్ష అంతకంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఎంత మేలు జరుగుతుందో.. అంత నష్టం కూడా జరుగుతోంది... కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త..

Kumaram Bheem Asifabad:   త‘స్మార్ట్‌’ జాగ్రత్త

-వీదేశీ యాప్‌ పేరిట మోసాలు

-పెట్టుబడుల స్వీకరణ వరకే క్లియరెన్స్‌

-విత్‌డ్రా ఆప్షన్‌ తీసేస్తున్న నిర్వాహకులు

-నిలువెల్లా మోసపోతున్న పెట్టుబడిదారులు

-జిల్లాలో పెరిగిపోతున్న బాధితులు

పాతకాలంలో.. ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు.. బ్యాంకుల్లో అయితే భద్రం అని చెప్పేవారు. దీంతో ప్రజలు బ్యాంకులను నమ్మి అందులోనే పొదుపు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండడమే శాపంగా మారింది. బ్యాంకు ఖాతాలో లక్ష అంతకంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఎంత మేలు జరుగుతుందో.. అంత నష్టం కూడా జరుగుతోంది... కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త..

కాగజ్‌నగర్‌, జూలై 26: సైబర్‌ నేరగాళ్లు రోజుకోక కొత్త మోసానికి తెరలేపుతున్నారు. ఇన్నాళ్లు బ్యాంకు ఏటీఎం పిన్‌ నంబరు మార్చాలని.., కొత్త పాస్‌ బుక్‌ కోసమని.. మోసం చేసిన సంఘటలు చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా వీదేశాలకు చెందిన నకిలీ ఫైనాన్సియల్‌ యాప్‌ల లింక్‌లు సెల్‌ఫోన్‌కు పంపిస్తున్నారు. వాటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌లో ఆప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. అందులో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని ఆశచూపి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ఉచ్చులో పడిన వారు నిలువెల్లా మోసపోతున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాల నుంచి చాలామంది పెట్టుబడులు పెట్టి మోసపోయారు. పెట్టుబడులు పెడితే ఒక్కరోజులోనే రెట్టింపు డబ్బులు వస్తాయని రోబోటిక్స్‌, ఏఐ ఇంటిలిజెన్స్‌, డేటాప్రొడక్ట్స్‌ పేరిట నకిలీ యాప్‌ల యాడ్‌లు ఆన్‌లైన్‌లో కన్పిస్తున్నాయి. ఈ సైట్‌లను క్లిక్‌చేస్తే సంబంధిత యాప్‌ నుంచి కస్టమర్‌ కేర్‌ అంటూ మాటల్లో పెట్టేసి ఒక్కరోజుల్లో డబ్బులు రెట్టింపు వస్తుందని ఆశ చూపుతున్నారు. ఒక్కరోజులోనే రెండింతలు వస్తున్నాయని అంటూ అప్పులు చేసి మరీ ఈ యాప్‌ల్లో పెట్టుబడులు పెట్టగానే సంబంధిత సెల్‌ ఫోన్లన్నీ స్విచ్‌ ఆఫ్‌ రావటం, విత్‌ డ్రా ఆప్షన్‌ లేకపోవడం, యాప్‌ను నిర్వాహకులు ఆన్‌లైన్‌ నుంచి క్షణాల్లో తీసేస్తుంటడంతో మోసపోయిన వారంతా లబోదిబోమంటున్నారు. ఈ తరహా దందా జిల్లాలో అధికంగా సాగుతోంది. ఒకరికి తెలియకుండా మరొకరు పెట్టుబడులు పెడుతూ నిలువెల్లా మోసపోతున్నారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత విత్‌ డ్రా ఆప్షన్‌ తీసేయటం, కస్టమర్‌ కేర్‌ నంబర్ల నుంచి ఫోన్లు ఎత్తక పోవటం, ఐపీ అడ్రసులన్నీ కూడా పొంతన లేకుండా ఉన్నట్టు బాధితులు పేర్కొంటున్నారు. తాము నష్టపోయినట్టు తెలిస్తే పరువు పోతుందని బయటికి ఎవరూ చెప్పడం లేదు. కాగా, ఈ ఫేక్‌ యాప్‌లన్నీ కూడా ప్రాక్సీ బ్రౌజర్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుండటంతో ఐపీ అడ్రసు కనిపెట్టలేకపోతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

సెల్‌ఫోన్‌ వాడుతున్న వారంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. వారం రోజుల క్రితం కూడా పీఎం కిసాన్‌పేరిట సాఫ్ట్‌వేర్స్‌ అన్ని మోబైల్స్‌కు సైబర్‌ నేరగాళ్లు పంపించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను క్లిక్‌ చేస్తే సెల్‌ ఫోన్‌లో ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్‌ అవుతుంది. అనంతరం మనసెల్‌ ఫోన్‌ హ్యాకర్‌ చేతిలోకి పోతుంది. అందులోని మన బంధువులు, స్నేహితుల సెల్‌ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి ఆరోగ్యం బాగాలేదని, తాను ఆసుపత్రిలో ఉన్నానని వెంటనే డబ్బులు పంపించాలని మోసాలు చేస్తున్నారు. బంధువులు నమ్మి డబ్బులు ఎకౌంట్లో వేసేసిన తర్వాత వాకబు చేస్తే తాను డబ్బులు అడుగలేదని చెప్పటంతో మోసపోయినట్టు లబోదిబోమంటున్నారు. సమాజంలో ఉండే పెద్దవ్యక్తులు కూడా హ్యాకర్ల చేతిలో ఇరికిపోతున్నారు. పోతే డబ్బులు పోనీ అందరికీ తెలియటం, కేసులు చిక్కులు ఎందుకని పక్కన పెట్టేస్తున్నారు. ఆన్‌లైన్‌ సైట్‌లో నకిలీ యాప్‌లు రకరకాలు వస్తున్నాయి. పొరపాటున క్లిక్‌చేస్తే వెంటనే కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ ఫోన్లలో కూడా మీ కుటుంబ సభ్యుల గురించి వాకబు చేసి ఇందులో పెట్టుబడులు పెట్టాలని మీకు లాభం వస్తుందని నమ్మిస్తున్నారు. ఇటువంటివి నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు..

- వీలైనంత వరకు తెలియని వ్యక్తులకు ఫోన్‌ నంబరు ఇవ్వకూడదు.

- తెలియని నంబరు నుంచి వచ్చిన మెస్సేజ్‌లకు, లింకులకు స్పందించకూడదు.

- తెలియని నంబరు నుంచి వచ్చే ఫోన్‌ సంబాషణలకు వివరాలు తెలుపకూడదు.

- ముఖ్యంగా ఓటీపీ, పాస్‌వర్డ్‌, ఏటీఎం పిన్‌ నంబరు ఎవరికీ చెప్పకూడదు.

- ఫోన్‌లో సైబర్‌ క్రైమ్‌ ఎమర్జెన్సీ నంబరు 1930ను ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోవాలి.

ఫిర్యాదులు ఇంతవరకు రాలేదు..

-కరుణాకర్‌, డీఎస్పీ కాగజ్‌నగర్‌

వీదేశీ యాప్‌ల పేరిట మోసాలు జరుగుతున్న సంఘటనపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఫిర్యాదులు వస్తే తప్పకుండా విచారణ జరుపుతాం. అలాగే సైబర్‌క్రైం వారికి దృష్టికి తీసుకెళ్లుతాం. ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

Updated Date - Jul 26 , 2024 | 10:41 PM