Share News

Kumaram Bheem Asifabad: లోక్‌సభ పోరు.. ప్రచార హోరు

ABN , Publish Date - May 08 , 2024 | 11:08 PM

కాగజ్‌నగర్‌, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో ప్రధానపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆయా అసెంబ్లీ నియోజవర్గాల నుంచి ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారిస్తున్నారు.

Kumaram Bheem Asifabad:   లోక్‌సభ పోరు.. ప్రచార హోరు

-అగ్రనేతలతో బహిరంగ సభలు

-ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు

-గెలుపుపై ఎవరి ధీమా వారిదే

-అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగా జిల్లా ఓటర్లు

కాగజ్‌నగర్‌, మే 8: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో ప్రధానపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఆయా అసెంబ్లీ నియోజవర్గాల నుంచి ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపే సామాజికవర్గాలను కూడగట్టుకునేందుకు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

క్యాడర్‌ను కాపాడుకుంటూ..: బీఆర్‌ఎస్‌

జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన క్యాడర్‌తో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిపించాలని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఈ పార్టీలోని కీలక నాయకులంతా కూడా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా ఉన్న క్యాడర్‌ను కాపాడుకుంటున్నారు. ఇన్నాళ్లు తమ పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ప్రధాన నాయకులంతా కూడా ఉదయం పల్లెబాట పట్టి రాత్రికి కాగజ్‌నగర్‌కు చేరుకుంటున్నారు.

ఆరు గ్యారలంటీలతో..: కాంగ్రెస్‌

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ కీలక అంశాలైన ఆరుగ్యారంటీలతో ముందుకు వెళ్లుతూ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆగ్రం సుగుణను గెలింపించాలని కోరుతు న్నారు. మంత్రి సీతక్కతోపాటు మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ రావిశ్రీనివాస్‌ కలిసి ఇతరపార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కార్నర్‌ మీటింగ్‌లను నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలను వివరిస్తున్నారు. బీజేపీ తీరును ఎండగడుతున్నారు. ఆసిఫాబాద్‌లో నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై బీఆర్‌ఎస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరతుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయన్న అంశాన్ని ప్రజల్లోకి దూసుక పోయేట్టు చేశారు.

ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘అమిత్‌ షో’..: బీజేపీ

బీజేపీలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబుతోపాటు ఉమ్మడి జిల్లా నాయకులు జిల్లా ఓటర్లను ఆకట్టుకునేందుకు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ను గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో అధిక మెజార్టీ సీట్లు రాగా సిర్పూరు నియోజకవర్గం మాత్రం బీజేపీ ఖాతాలోకి వచ్చింది. బీజేపీ బలంగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఒక్క ఓటు పోనీయకుండా ప్రచారం చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఆదివారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాతో వికాస్‌ సంకల్ప సభను పెట్టించారు. ఈ సారి 400 పార్‌ పక్కా అంటూ ప్రధాన ఎజెండాతో ప్రజల్లో దూసుకు పోతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయా మండలాల్లో కార్నర్‌ సమావేశాలు పెట్టి ఓటింగ్‌ పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు క్యాడర్‌ పార్టీ క్యాడర్‌ను పెంచేందుకు అడుగులు వేస్తున్నారు. తాము రిజర్వేషన్లను తొలగించమంటూ పేర్కొంటూ కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇస్తూ మోదీ చేసిన అభివృద్ధిని చూసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గోడం నగేష్‌ను గెలిపించాలని కోరుతున్నారు.

Updated Date - May 08 , 2024 | 11:08 PM