Share News

Kumaram Bheem Asifabad: ప్రచారానికి మిగిలింది ఇంకా మూడు రోజులే

ABN , Publish Date - May 08 , 2024 | 11:01 PM

కాగజ్‌నగర్‌, మే 8: పార్లమెంటు ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది. ప్రచారపర్వం ముగింపునకు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఆయాపార్టీల అభ్యర్థులు, నాయకులు తమ కార్యకర్తలతో కార్నర్‌ మీటింగ్‌, ఆయా వార్డుల ప్రజలతో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు.

 Kumaram Bheem Asifabad: ప్రచారానికి మిగిలింది ఇంకా మూడు రోజులే

- ప్రచారవేగాన్ని పెంచిన ఆయాపార్టీల నాయకులు

- చేరికలపై దృష్టిసారిస్తున్న ప్రధానపార్టీలు

- చివరి అస్త్రాలను సంధిస్తున్న అభ్యర్థులు

- అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా జిల్లా ఓటర్లు

కాగజ్‌నగర్‌, మే 8: పార్లమెంటు ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది. ప్రచారపర్వం ముగింపునకు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఆయాపార్టీల అభ్యర్థులు, నాయకులు తమ కార్యకర్తలతో కార్నర్‌ మీటింగ్‌, ఆయా వార్డుల ప్రజలతో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. గడియ తీరిక లేకుండా పల్లెలు, పట్టణాల్లో సమాశాల్లో పాల్గొంటున్నారు. ఇంటింటా కరపత్రాల పంపిణీ చేపడుతున్నారు. అలాగే పోలింగ్‌బూత్‌ వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు పెట్టేస్తున్నారు. ఉదయం పల్లెల్లో, సాయంత్రం పట్టణాల్లో మకాం వేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉండటంతో ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తున్నారు. ఓటర్ల మనుసును గెలుచుకునేందుకు అవసరమైన చివరి అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఏవర్గాన్ని విస్మరించకుండా అందరినీ కలుస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

పెరుగుతున్న చేరికలు..

కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ప్రచారం ఒక్కసారి ఊపందుకుంది. భారీ సభలు, ముఖ్యనేతల రాకతో ఒక్కసారిగా రాజకీయ వాతావరం వేడెక్కింది. పార్టీలో చేరాలంటూ ద్వితీయాశ్రేణి నాయకుల ఇంటికి వెళ్ల్లి మంతనాలు చేస్తున్నారు. ఫోన్లలో సంప్రదింపులు చేస్తున్నారు. గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారి కోసం గాలం వేస్తున్నారు. తమపార్టీల వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయ త్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల ఖర్చుల విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయటం లేదు.

సామాజిక వర్గాల ఓట్ల కోసం..

ఈ సారి జరిగే ఎంపీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల నాయకులు సామాజికవర్గాలపై దృష్టిసారించారు. ఇందుకు ప్రత్యర్థి పార్టీలకు దీటుగా వీలైనన్నీ ఎక్కువ ఓట్లను కొల్లగొట్టే ప్రణాలిక రూపొందిస్తున్నారు. గెలిచాక తప్పకుండా సాయం చేస్తామని హామీలిస్తూ గుంపగుత్త ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్ని పార్టీలకు అగ్ని పరీక్షే..

ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాలకు చెందిన ఓట్లు ఎంపీ అభ్యర్థి గెలుపు ఓటములకు కీలకంగా మారనున్న దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇన్‌చార్జీ మంత్రి సీతక్క సిర్పూరు, కౌటాల, బెజ్జూరు మండలాల్లో కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీలో ప్రజల చేరికలపై దృష్టి సారిస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఈ జిల్లా వారే కావటంతో ఓటింగ్‌ శాతం పెంచటంతో పాటు మెజార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. బీజేపీలో అసెంబ్లీస్థానం డాక్టర్‌ హరీష్‌బాబు కైవసం చేసుకోవటంతో తనకున్న బలగాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే హరీష్‌బాబు కార్నర్‌ మీటింగ్‌లు పెడుతున్నారు. తమ క్యాడర్‌, పార్టీపై ఉన్న అభిమానాన్ని కూడగట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఓట్లు మూడు పార్టీల నాయకులకు అగ్నిపరీక్షంగా మారనున్నాయి.

Updated Date - May 08 , 2024 | 11:01 PM