Share News

Kumaram Bheem Asifabad: జనా‘కర్షక’ బడ్జెట్‌

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:59 PM

ఆసిఫాబాద్‌, జూలై 25: రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌ రూ.2,91,159 కోట్లను ప్రవేశపెట్టారు.

Kumaram Bheem Asifabad:  జనా‘కర్షక’ బడ్జెట్‌

- వ్యవసాయ రంగానికి పెద్దపీట

- రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

- శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క

- వ్యవసాయ రంగానికి రూ.72,650 కోట్ల కేటాయింపు

- నియోజకవర్గానికి 3,500ఇండ్లు

ఆసిఫాబాద్‌, జూలై 25: రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌ రూ.2,91,159 కోట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రూ.72,650 కోట్లను కేటాయించారు. ఈ బడ్జెట్‌ ద్వారా భూమిలేని అర్హులైన రైతుకూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు వెల్ల డించారు. 33రకాల సన్నవడ్లకు రూ.500 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పైసా ఖర్చు లేకుండా పంటలకు బీమాను అందించి రైతుకు పంట భద్రత కల్పించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో జిల్లాలో ఉన్న లక్షా అరవై వేల పై చిలుకు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతుకూలీలకు కూడా ప్రభుత్వం ఏటా రూ.12వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో కూలీలకు ఆర్థికంగా భరోస చేకూరనుంది. సన్నవడ్లను సాగు చేసుకుంటున్న రైతులకు బోనస్‌ ప్రకటించడంతో లబ్ది చేకూరనుంది. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారు. రూ.500గ్యాస్‌ పథకానికి రూ.723కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2418కోట్లు కేటాయించడంతో జిల్లాలో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6లక్షల సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకోగా 2024-25ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 7వేల ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ఇండ్లులేని నిరుపేదలకు అందనున్నాయి. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఇందిర మహిళ శక్తి పథకంను రూపకల్పన చేసినట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందుకోసం అవసరమైన నిధులను కేటాయించి మహిళా సంఘాలకు స్ర్తీనిధి రుణాలను అందించనుంది. విద్యారంగానికి రూ.21,292కోట్లు కేటాయించగా జిల్లాలోని ప్రభుత్వపాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన మెరుగుపడనుంది. నీటి పారుదల రంగానికి రూ.22,301కోట్లు కేటాయించగా జిల్లాలోని కుమరంభీం, జగన్నాఽథపూర్‌ కాలువల నిర్మాణాలు, వట్టివాగు, ఎన్టీఆర్‌ సాగర్‌ ప్రాజెక్టుల అధునీకరణకు నోచుకొనున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,816 కోట్లు కేటాయించడంతో జిల్లాలోని రోడ్లులేని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డుసౌకర్యంతో పాటు ఇతర మౌళికవసతులు సమకూరనున్నాయి. వైద్యరంగానికి రూ.11,468కోట్లు కేటాయించగా జిల్లాలోని ఏజేన్సీ మండలాల్లో వైద్యసేవలు మెరుగుపడనున్నాయి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించడంతో ఆయావర్గాల సంక్షేమానికి నిధులు సమకూర నున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షికబడ్జెట్‌పై ప్రముఖుల అభిప్రా యాలు ఈ విధంగా ఉన్నాయి.

రాష్ట్ర ప్రగతికి అనుకూలమైన బడ్జెట్‌:

- కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, డీసీసీ అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రగతికి అనుకూలంగా ఉంది. అప్పుల్లో ఉన్న తెలంగాణతో ఉన్నంతలో సర్ధుకుని కేటాయించిన బడ్జెట్‌. కేంద్ర సహాయం లేకున్నా వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించారు. నీటిపారుదల రంగానికి పెద్దపీట వేశారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు నిధులు కేటాయించడం హర్షనీయం. ఉన్నంతలో సంతోషమైన బడ్జెట్‌.

కేవలం ఉట్టి బడ్జెట్‌..

- అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ నాయకుడు

రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉట్టి బడ్జెట్‌ అన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు తప్ప అవి ఖర్చుపెట్టె పరిస్థితులు కనిపించడంలేదు. ఎన్నికల ముందు రైతుబంధ పథకం కింద రూ.15వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమాన్ని విస్మరించి తక్కువ నిధులు కేటాయించడం శోచనీయం.

మహిళ సంఘాలకు నిధులు కేటాయించడం హర్షనీయం..

- శ్రీదేవి, జిల్లా మహిళా సమైఖ్య అధ్యక్షురాలు

మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షనీయం. ఇందిర మహిళ శక్తి పథకం ద్వారా స్త్రీనిధి రుణాలను అందించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకొవడం అభినంద నీయం. ఈపథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల సమాఖ్యలకు లబ్ధి చేకూరుతుంది.

కేటాయింపులు తప్ప ఖర్చులు లేవు..

- దుర్గం దినకర్‌, సీపీఎం జిల్లా నాయకులు

రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం కేటాయింపులే ఉంటాయి తప్ప అవి క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టలేరు. ప్రభుత్వం బడ్జెట్‌లో దళితబంధు స్థానంలో అంబేద్కర్‌ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని గతంలో చెప్పినా ఇప్పుడు దాని ఊసేలేదు. పెన్షన్‌ల పెంపు ప్రస్తావన, నిరుద్యోగభృతి, విద్యా భరోస వంటి పథకాలకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

బడ్జెట్‌లో పథకాల ఊసేలేదు..

-లెండుగురే శ్యాంరావు, బీఆర్‌ఎస్‌ సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్‌

బడ్జెట్‌లో నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన వివిధ పథకాల పద్దులు కేటాయించలేదు. దళిత బంధుకు దిక్కేలేదు. మత్స్యకారుల కోసం నిధులు పెట్టలేదు. భవిష్యత్తు కోసం ఏమీ చేస్తున్నారన్నది స్పష్టలేదు. ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్టు చేశారు. ఒక్క పథకంపై కూడా స్పష్టత లేదు. దళితుల పట్ల అన్యాయం చేసింది. ఈ బడ్జెట్‌లో కొత్తది ఏమీ లేదు.

అంకెల గారడిగా ఉంది..

-గుళ్లపల్లి ఆనంద్‌, టీడీపీ ఉమ్మడి జిల్లా పార్లమెంటు కన్వీనర్‌

బడ్జెట్‌ అంతా కూడా అంకెల గారిడి ఉంది. మహిళా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాల్లో క్లారిటీ లేదు. నిరుపేదల కోసం ఉన్న పథకాల్లో ఆశించిన మేర కేటాయింపులు లేవు. వివిధ కులాల వారికి నిధుల కేటాయింపు జరుగలేదు. రైతులకు కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది.

Updated Date - Jul 25 , 2024 | 10:59 PM