Share News

Kumaram Bheem Asifabad: ఓటరు జాబితా రెడీ..

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:15 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 29: ఈఏడాది ఫిబ్రవరిలో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయింది.

 Kumaram Bheem Asifabad:  ఓటరు జాబితా రెడీ..

-జిల్లాలో 98శాతం పూర్తయిన సర్వే

-ఎన్నికల ప్రకటన వరకు ఓటర్ల నమోదుకు అవకాశం

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 29: ఈఏడాది ఫిబ్రవరిలో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుండగా, ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, వలసవెళ్లిన, చనిపోయిన వారిపేర్లు తొలగించి ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను ఈనెల 30న విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఆగస్టు 20 నుంచి జిల్లాలో మొదలైన ఇంటింటి సర్వే అక్టోబరు 18వరకు కొనసాగనుంది. అక్టోబరు 19నుంచి నవంబరు 28వరకు జాబితా పూర్తి, అక్టోబరు 29నుంచి నవంబరు 28వరకు అభ్యంతరాలు, ఓటరు జాబితాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 24వరకు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. జనవరి6న పూర్తి స్థాయి తుది జాబితాను విడుదల చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో సిర్పూర్‌లో 2,29,577మంది ఓటర్లకు గానూ ఇప్పటికే 2,22,795 (97.05ు)ఓటర్ల ఇంటింటా సర్వే పూర్తయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఆసిఫాబాద్‌లో మొత్తం ఓటర్లు 2,27,540మంది ఉండగా 2,26,746 (99.65 ు) పూర్తి చేశారు. జనవరి 2025లో తుది జాబితా ప్రచురించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు..

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాబితా సవరణలో భాగంగా పోలింగ్‌కేంద్రాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. జిల్లావ్యాప్తంగా బీఎల్‌వోలు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రంలో ఓటరు జాబితాలతో అక్టోబరు 29నుంచి నవంబరు 28వరకు అందుబాటులో ఉండి కొత్తఓటర్లు, మార్పులు, చేర్పులు, తొలగింపు, ఫొటోల మార్పులు వంటి వాటికి దరఖాస్తులు స్వీకరిస్తారు. 2025జనవరి1 నాటికి 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి వారినుంచి కొత్త ఓటు నమోదుకు దరఖాస్తులు తీసుకుంటారు. చిరునామాలో లేని వారిని, చనిపోయిన వారిని ఇప్పటికే నిర్వహించిన సర్వేలో గుర్తించారు. వచ్చేనెలలో తుది జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పట్టణాలు, మున్సిపాలిటీ ఓటర్లను తప్పించి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా జాబితా తయారీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

Updated Date - Sep 29 , 2024 | 10:15 PM