Share News

అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యేనా?

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:56 PM

బడ్జెట్‌ అనగానే అన్నీ వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. పన్నుల విధింపు, మినహాయింపులు, కొత్త పథకాల కేటాయిం పులపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గురువారం ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కిలిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టగా ఈసారి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వరాలు కురుస్తాయని భావిస్తున్నారు

అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యేనా?

మంచిర్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ అనగానే అన్నీ వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. పన్నుల విధింపు, మినహాయింపులు, కొత్త పథకాల కేటాయిం పులపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గురువారం ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కిలిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టగా ఈసారి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వరాలు కురుస్తాయని భావిస్తున్నారు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పెండింగులో ఉన్న పనుల వివరాలను ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందున బడ్జెట్‌లో వాటికి స్థానం కల్పిస్తారనే నమ్మకం ప్రజల్లో నెలకొంది.

మంచిర్యాల నియోజకవర్గం: గోదావరి సమీపంలో ఉన్న మాతాశిశు ఆస్పత్రి యేటా ముంపునకు గురవు తుండటంతో ప్రస్తుత ఆర్డీవో కార్యాలయం ఉన్న చోట కొత్తగా నిర్మించాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రతిపాదిస్తున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఇప్పటికే స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పనులు ఊపందుకునే అవకాశాలున్నాయి. రాళ్ల వాగుపై ఉన్న లోలెవల్‌ వంతెన వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాళ్లవాగుపై వంతెనకు సుమారు రూ.20 కోట్ల అంచనాతో భూమి పూజ సైతం జరిగింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రంగంపేట, పవర్‌సిటీ కాలనీ, అండాళమ్మ కాలనీ వాసులు పడుతున్న కష్టాలు తీరనుంది. గత ప్రభుత్వ హయాంలో గోదావరిపై నిర్మించ తలపెట్టిన మంచిర్యాల- అంతర్గాం హై లెవల్‌ వంతెనకు రూ.164 కోట్లు బడ్జెట్‌ విడుదల కావలసి ఉంది.

చెన్నూరు నియోజకవర్గం : కోటపల్లి మండలంలో నక్కలపల్లి లోతొర్రె, బ్రాహ్మణపల్లి మత్తిడివాగు, లింగన్నపేట- ఏదులబందం మధ్యలో వంతెనల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ పనులకు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ హామీ ఇచ్చారు. బడ్జెట్‌ కేటాయిస్తే పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణంలో పలు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

బెల్లంపల్లి నియోజకవర్గం: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బెల్లంపల్లిలో మామిడి మార్కెట్‌యార్డు అసం పూర్తిగా ఉంది. యార్డుకు రూ.1.26 కోట్లు ప్రతిపాదించగా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది. ఈ విషయమై ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ హామీఇచ్చారు. వేమనపల్లి మండలంలో బుయ్యారం నుంచి మంగెనపల్లి వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్ట వలసి ఉంది. మండల కేంద్రం నుంచి సుంపుటం వెళ్లే దారిలో లోలెవల్‌ వంతెన కారణంగా ప్రాణహిత నది ఉప్పొంగినప్పుడల్లా నీట మునుగుతోంది. ఇక్కడ హై లెవల్‌ వంతెన నిర్మించాల్సి ఉంది. ముల్కలపేట నుంచి రాచర్లకు వెళ్లే దారిలో సంవత్సరం క్రితం వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ అప్రోచ్‌ రోడ్డు ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ కారణంగా యేటా కుంగుతోంది. వంతెనకు ఇరువైపులా బీటీ రోడ్లు నిర్మించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 24 , 2024 | 10:56 PM