చేప పిల్లల పంపిణీ పేరిట నిధుల గోల్‌మాల్
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:18 AM
చేపపిల్లల పంపిణీ పేరిట బీఆర్‌ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన తలసాని, హరీశ్‌రావు మత్స్యశాఖలో కోట్లాది నిధులు కొట్టేశారని రాష్ట్ర ఫిషర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయికుమార్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ హయాంలో కోట్లు కొట్టేసిన హరీశ్, తలసాని
ఫిషర్మన్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ ఆరోపణ
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): చేపపిల్లల పంపిణీ పేరిట బీఆర్‌ఎస్ పాలనలో మంత్రులుగా పనిచేసిన తలసాని, హరీశ్‌రావు మత్స్యశాఖలో కోట్లాది నిధులు కొట్టేశారని రాష్ట్ర ఫిషర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయికుమార్ ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ, చేపల పంపిణీ వ్యవహారంలో ముదిరాజ్‌లు, బెస్తల మధ్య పంచాయతీ పెట్టి పబ్బం గడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన దోపిడీపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని తెలిపారు.
సిద్దిపేట, మల్లన్న సాగర్‌లో హరీశ్‌రావు ఎన్ని చేపలు వేశారో చెప్పాలని, ఈ విషయంలో తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రొయ్యపిల్లల పంపిణీలోనూ తలసాని, హరీశ్‌రావు దోచుకున్నారని, విచారణ తర్వాత ఈ ఇద్దరూ జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. చెరువు వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా గత పదేళ్ళుగా చేపలు వేశారని, కానీ ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి చెరువు వాతావరణ పరిస్థితిని బట్టి చేపపిల్లలు వేస్తున్నట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నవరాత్రుల నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభించిందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేపపిల్లల పంపిణీ జరుగుతుందని సాయికుమార్ ప్రకటించారు.