Share News

Arvapally: ఆ బాలుడి ప్రాణం తీసింది కన్నతండ్రే!

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:20 AM

తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఐదేళ్ల కుమారుడు ‘నాన్నా.. నాన్నా’ అంటూ పక్కనే ఉన్న తనను హత్తుకునేందుకు ప్రయత్నించడంతో ఆ తండ్రి.. ఆ బిడ్డను చెంపమీద గట్టిగా కొట్టాడు! ఆపై బాలుడి ఛాతీ మీద మూడుసార్లు గట్టిగా పిడికిలితో గుద్దాడు! అస్వస్థతతో కొంతసేపు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిపడిన ఆ బాలుడిని ఏమీ ఎరుగనట్లు తనే ఊర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు! ఫలితం లేకపోయింది.

Arvapally: ఆ బాలుడి ప్రాణం తీసింది కన్నతండ్రే!

  • భార్యతో గొడవ, ఆ కోపం ఐదేళ్ల కొడుకుపై

  • నిద్రలో హత్తుకునేందుకు ప్రయత్నించిన కొడుకుకిచెంపదెబ్బ.. ఛాతీపై 3 పిడిగుద్దులు

  • ఊపిరాడక బాలుడి మృతి.. అంత్యక్రియలు

  • తర్వాత ఇంట్లో రక్తపు మరకలున్న వస్త్రం లభ్యం

  • భర్తను అనుమానించిన భార్య.. ఫిర్యాదు

  • అర్వపల్లిలో బాలుడి మృతిపై వీడిన మిస్టరీ

అర్వపల్లి, జూన్‌ 3: తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఐదేళ్ల కుమారుడు ‘నాన్నా.. నాన్నా’ అంటూ పక్కనే ఉన్న తనను హత్తుకునేందుకు ప్రయత్నించడంతో ఆ తండ్రి.. ఆ బిడ్డను చెంపమీద గట్టిగా కొట్టాడు! ఆపై బాలుడి ఛాతీ మీద మూడుసార్లు గట్టిగా పిడికిలితో గుద్దాడు! అస్వస్థతతో కొంతసేపు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిపడిన ఆ బాలుడిని ఏమీ ఎరుగనట్లు తనే ఊర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు! ఫలితం లేకపోయింది. ఆ పిడిగుద్దులను తట్టుకోలేని ఆ లేత గుండె ఆగిపోయింది!! సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల అద్విక్‌తేజ్‌ (5) మృతిచెందిన బాలుడి ఘటన గుర్తుందా? ఈ ఘటనలో కన్నతండ్రి రావుల భిక్షమే కాలయముడని విచారణలో తేలింది.


భార్యతో గొడవపడటం.. ఆ కోపంతో ఉన్న తన దగ్గరకు అద్విక్‌తేజ్‌ వచ్చేందుకు ప్రయత్నించడంతో భిక్షం ఉన్మాదంతో దారుణ హత్యకు ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. ఘటన వివరాలను ఎస్సై యాకోబు వెల్లడించారు. రావుల భిక్షం-కర్ణ భార్యభర్తలు. వీరికి అద్విక్‌తేజ్‌తో పాటు కుమార్తె కూడా ఉంది. ఈనెల 20న ఇంట్లో భార్యాభర్తలు గొడవపడ్డారు. మర్నాడు తెల్లవారుజామున ఆరున్నరకు కర్ణ.. సరుకుల కోసం కిరణాషాపుకు వెళ్లి వచ్చేసరికి బెడ్‌ మీద కుమారుడు అర్విక్‌తేజ్‌ ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరవుతుండటాన్ని చూసింది. అప్పటికీ ఏమీ ఎరుగున్నట్టున్న భర్తకు విషయం చెప్పి.. ఇద్దరూ కలిసి ఊర్లోని ఆర్‌ఎంపీ వద్దకు బాలుడిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుమలగిరిలోని మరో వైద్యుడి దగ్గరకు.. అక్కడి నుంచి 108లో సూర్యాపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లే సరికే బాలుడు మృతిచెందాడు.


మృతదేహాన్ని జాజిరెడ్డిగూడెం గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేశారు. అయితే అద్విక్‌తేజ్‌ అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజుల తర్వాత ఇంట్లో వస్తువులను కర్ణ సర్దుతుండగా రక్తపు మరకలతో కూడిన ఓ వస్త్రం కనిపించింది. అద్విక్‌తేజ్‌ అస్వస్థతకు గురైన సమయంలో భర్త పక్కనే ఉండటం, కుమారుడి మృతి తర్వాత ఒక మాదిరిగా ప్రవర్తిస్తుండటంతో కర్ణ అతడినే అనుమానించింది. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, తన భర్త భిక్షంను విచారించాలని మే 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మే 30న బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్టుమార్టం నిర్వహించారు. భిక్షంను ప్రశ్నించగా కుమారుడిని తానే చంపానని అంగీకరించాడు. తాను పిడిగుద్దులు కురిపించగానే అద్విక్‌తేజ్‌ రక్తం కక్కుకున్నాడని.. భార్యకు అనుమానం రాకుండా వేరే వస్త్రంతో తుడిచేసినట్లు చెప్పాడు. బిక్షంను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 04 , 2024 | 03:20 AM