Share News

Kottagudem: కాన్పుకు సమయముంది ఇంటికెళ్లు..

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:14 AM

ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.

Kottagudem: కాన్పుకు సమయముంది ఇంటికెళ్లు..

  • గర్భిణిని పంపేసిన మాతాశిశు సంరక్షణ కేంద్రం వైద్యులు

  • నొప్పులు తీవ్రమై 108లో ప్రసవం

గుండాల, జూన్‌ 17: ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది. భద్రాద్రి జిల్లా గుండాల మండల కేంద్రానికి 15 కి.మీల దూరంలోని నాగారం గ్రామానికి చెందిన కల్తి నవ్యకు శనివారం రాత్రి పురుటి నొప్పులు మొదలయ్యాయి. ఉదయం వరకు వేచి ఉండి ఆదివారం ఉదయాన్నే గుండాలలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి నెలలు నిండకపోవడంతో కొత్తగూడెంలోని మాతాశిశు కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు.


వారి సూచన మేరకు గర్భిణిని అక్కడికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఒక ఇంజక్షన్‌ చేసి కాన్పుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఇంటికి వెళ్లమన్నారు. దాంతో నవ్య నొప్పులతోనే ఆర్టీసీ బస్సులో 100 కి.మీలు ప్రయాణించి ఇంటికి చేరుకుంది. ఆదివారం రాత్రి మళ్లీ నొప్పులు ఎక్కువ అవ్వడంతో నాగారం నుంచి 108లో తీసుకెళుతుండగా వాహనంలోనే సుఖప్రసవం జరిగింది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నవ్య భర్త సురేష్‌, కుటుంబసభ్యులు ఆరోపించారు.

Updated Date - Jun 18 , 2024 | 04:14 AM