Telangana: అబ్బాయిలే పుడుతున్నారు..!
ABN , Publish Date - Feb 26 , 2024 | 05:44 AM
అబ్బాయే కావాలనే ఆలోచనో..? ఆడ పిల్లంటే చులకనో..? రాష్ట్రంలో లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతోంది.
తెలంగాణలోని 78 శాతం జిల్లాల్లో మగ పిల్లల జననాలే ఎక్కువ
పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 69 శాతం మంది అబ్బాయిలు
యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణమనే ఆరోపణలు
ఏడు జిల్లాల్లోనే ఆడ పిల్లల పుట్టుక అధికం.. అందులో 4 ఏజెన్సీవే
ఇవన్నీ కూడా ప్రైవేటు ఆస్పత్రులు తక్కువగా ఉన్నవే..!
వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్లిళ్లు కష్టమే!
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): అబ్బాయే కావాలనే ఆలోచనో..? ఆడ పిల్లంటే చులకనో..? రాష్ట్రంలో (Telangana) లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతోంది. దీనికి యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ- బర్త్ పోర్టల్ గణాంకాల ప్రకారం జనవరిలో జన్మించినవారిలో 52% మగపిల్లలే ఉన్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 9,986 జననాలు రికార్డయ్యాయి. ఇందులో 5,181 మంది అబ్బాయిలు కాగా, 4,805 మంది అమ్మాయిలు. ఇంతటి వ్యత్యాసం ప్రమాదకరమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మగపిల్లల సంఖ్య పెరుగుతుండగా, ఆడ పిల్లల సంఖ్య తగ్గుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యిమంది అబ్బాయిలకు 988 మంది అమ్మాయిలున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం బాలల లింగ నిష్పత్తి (చైల్డ్ సెక్స్ రేషియో) 1000:932గా ఉంది.
కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 999 మంది స్త్రీలుండగా, పట్టణ ప్రాంతాల్లో 970 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ-బర్త్ పోర్టల్ జనవరి గణాంకాల మేరకు 78% జిల్లాల్లో అబ్బాయిలే ఎక్కువగా జన్మించారు. ఇందులో ములుగు మినహా 32 జిల్లాల గణాంకాలను అప్లోడ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లాల్లో అబ్బాయిల బర్త్ రేటు ఎక్కువగా ఉంది. అక్కడ 69% మంది మగ పిల్లలు పుట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా(60) ఆ తర్వాత స్థానంలో ఉంది. నల్లగొండ (56%), సూర్యాపేట (55%), ఆదిలాబాద్, హైదరాబాద్, మేడ్చల్ (54%), ఖమ్మం, మంచిర్యాల (53%) జిల్లాల్లోనూ అబ్బాయిల జననాలు సగంపైగా ఉన్నాయి. కాగా, నిర్మల్, ని జామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో మగపిల్లల కంటే ఆడ పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడు జిల్లాల్లో మహాలక్ష్ములదే పైచేయి
రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోనే ఆడపిల్లల జననాల శాతం ఎక్కువగా ఉంది. అవి.. జయశంకర్ భూపాలపల్లి (62%), నిర్మల్ (54.28%), వికారాబాద్ (53%), కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం (52%), జగిత్యాల (51%), రాజన్న సిరిసిల్ల (51.55%), వీటన్నిటిలోనూ ఆడపిల్లల జననాలు 50 శాతానికిపైగా ఉండడం విశేషం. నిజానికి ఈ ఏడింటిలో నాలుగు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జిల్లాలు. అయినప్పటికీ ఆడపిల్ల జననాలు ఎక్కువగా ఉండానికి.. ప్రైవేటు ఆస్పత్రులు తక్కువగా ఉండడం ఓ కారణమై ఉండొచ్చని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మిగతా జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఉండడంతో పాటు, యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని.. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే గర్భ విచ్ఛిత్తికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని.. ప్రస్తుత చైల్డ్ సెక్స్రేషియో వ్యత్యాసం ఇలాగే కొనసాగితే రెండు దశాబ్దాల తర్వాత యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టమేనని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపై కఠినంగా వ్యవహరించాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.