Share News

Kavitha: అమ్మ కాళ్లకు మొక్కి.. అన్నకు రాఖీ కట్టి..

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:19 AM

ఐదున్నర నెలలు తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వాపోయారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని.. అపవాదుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పారు.

Kavitha: అమ్మ కాళ్లకు మొక్కి.. అన్నకు రాఖీ కట్టి..

  • బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత భావోద్వేగం

  • హారతి ఇచ్చి స్వాగతం పలికిన కేటీఆర్‌ సతీమణి శైలిమ

  • శంషాబాద్‌ విమానాశ్రయంలో గులాబీ శ్రేణుల సందడి

  • నేడు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో తండ్రి కేసీఆర్‌తో భేటీ

  • ఐదున్నర నెలలు అన్యాయంగా జైల్లో నిర్బంధించారు

  • అపవాదుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడతా

  • పోరాటం కొనసాగిస్తా.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది: కవిత

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, శంషాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఐదున్నర నెలలు తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వాపోయారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని.. అపవాదుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పారు. ప్రజాక్షేత్రంలో తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి, ఐదున్నర నెలలు తిహాడ్‌ జైల్లో ఉన్న కవిత.. బెయిల్‌ లభించడంతో బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.


బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన ఆమెకు కేటీఆర్‌ సతీమణి శైలిమ హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. అక్కడ సమీప బంధువులు, పార్టీ ముఖ్యులను ఆమె పలకరించారు. ఇంట్లోకి వెళ్లాక తల్లి శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. పూజామందిరంలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం భర్త అనిల్‌కుమార్‌కు పాదనమస్కారం చేసి.. అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్లు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు.. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో మంగళవారం రాత్రి 9:10 గంటలకు తిహాడ్‌ జైల్లోంచి కవిత బయటకొచ్చారు. 9:40 గంటలకు ఢిల్లీ వసంత్‌ విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకున్నారు.రాత్రి అక్కడే బస చేశారు.


రాత్రి ఒంటి గంట దాకా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కవిత మాట్లాడుతూనే ఉన్నారని ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత చెప్పారు. బుధవారం మధ్యాహ్నం రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచే కవిత వర్చువల్‌గా హాజరయ్యారు. మధ్యాహ్నం 2.40కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు. సాయంత్రం 5:45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు కవితకు ఘనంగా స్వాగతం పలికాయి. వేల సంఖ్యలో చేరుకున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు.. ‘వాడెవ్వడు వీడెవ్వడు.. కవితక్కకు అడ్డెవ్వడు’... ‘కవితక్క కడిగిన ముత్యం’.. ‘కవితక్క నిప్పు.. కవితక్క సీఎం’ అంటూ నినాదాలు చేశారు.


మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ నవీన్‌ రెడ్డి కవితకు స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వాయితో కవిత బంజారాహిల్స్‌ నివాసానికి బయలుదేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. కవితకు గజమాల వేసేందుకు కిషన్‌గూడ సమీపంలో కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కవిత కారు అక్కడ ఆగినా.. ఆమె కారు దిగకపోవడంతో వాహనానికి గుమ్మడికాయతో దిష్టితీసి పంపించి వేశారు. గురువారం ఉదయం తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కవిత ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు.


  • తదుపరి విచారణ 11న

సీబీఐ చార్జిషీట్‌పై బుధవారం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో రెగ్యులర్‌ విచారణ జరిగింది. కవితకు మంగళవారమే బెయిల్‌ రావడంతో కోర్టు అనుమతితో విచారణకు ఆమె వర్చువల్‌గా హాజరయ్యారు. సీబీఐ చార్జిషీట్‌ ఫైలింగ్‌ సరిగాలేదని గతంలోనే కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లగా, అదే విషయాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిందని, అయితే ఆ కాగితాల్లో నాణ్యత లేదని, దీనివల్ల కోర్టు విచారణలో వాదనలు వినిపించడానికి ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. చార్జిషీట్‌, ఫైలింగ్‌ ప్రక్రియను సరిచేసి నిందితుల తరఫున న్యాయవాదులకు సెప్టెంబరు 4వ తేదీలోపు ఆ కాపీలను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు.


  • కించపర్చే వారిపై చర్యలు తీసుకోండి!

కవాడిగూడ: ఎమ్మెల్సీ కవితను కించపర్చేలా.. కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని.. వారిపై చట్టప్రకారం చర్యలకు ఆదేశాలివ్వాలని బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు మహిళా కమిషన్‌ను కోరారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరేళ్ల శారదను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 29 , 2024 | 04:19 AM