Share News

భారత్‌లో మళ్లీ పెన్సిలిన్‌ ఉత్పత్తికి శ్రీకారం

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:26 AM

మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మళ్లీ పెన్సిలిన్‌ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1990వ దశకంలోనే దేశంలో ఉత్పత్తిని ఆపేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు తొలిసారిగా పెన్సిలిన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది.

భారత్‌లో మళ్లీ పెన్సిలిన్‌ ఉత్పత్తికి శ్రీకారం

  • 30ఏళ్ల తర్వాత దేశీయంగా తయారీ

  • కాకినాడలో అరబిందో ఫార్మా లైఫియస్‌ ప్లాంట్‌ ప్రారంభం

  • వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

  • 135 ఎకరాల్లో.. 2,500 కోట్ల పెట్టుబడి

  • ఇక్కడ పెన్సిలిన్‌-జి ఉత్పత్తి

తొండంగి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మళ్లీ పెన్సిలిన్‌ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1990వ దశకంలోనే దేశంలో ఉత్పత్తిని ఆపేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు తొలిసారిగా పెన్సిలిన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. అరబిందో ఫార్మా కంపెనీ కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవినగరం గ్రామంలో నిర్మించిన లైఫియస్‌ ఫార్మా ప్లాంట్‌ను ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో యాంటీబయాటిక్‌ మందుల తయారీలో కీలకమైన పెన్సిలిన్‌-జీని ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెన్సిలిన్‌ తయారీలో చైనాను కింగ్‌గా చెబుతారు. పెన్సిలిన్‌ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడం, దాన్ని చాలా తక్కువ ధరకే అందించడంతో.. ప్రపంచ మార్కెట్‌లో చైనా పోటీని తట్టుకోలేక భారత్‌ 1990వ దశకంలో పెన్సిలిన్‌ ఉత్పత్తిని ఆపేసింది.

అప్పటి నుంచి చైనా నుంచే పెన్సిలిన్‌ను దిగుమతి చేసుకుంటోంది. అయితే.. 2020లో కొవిడ్‌ సమయంలో చైనా పెన్సిలిన్‌ సరఫరా చేయకుండా భారత్‌లోపాటు అనేక దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీంతో.. ఫార్మా రంగంలో దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) పథకం కింద కేంద్ర ప్రభు త్వం పెన్సిలిన్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికోసం స్వదేశీ కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించగా... అరబిందో ఫార్మా కంపెనీ అవకాశం దక్కించుకుంది. కాకినాడ సెజ్‌లో లైఫియస్‌ ఫార్మా ప్లాంట్‌ను ఏడాదిన్నరలోనే నిర్మించింది. ఇది అందుబాటులోకి రావడంతో మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ దీన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.

Updated Date - Oct 30 , 2024 | 05:26 AM