Rural Employment Scheme: మార్చి లోపు ఉపాధి పనులు పూర్తికావాలి
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:59 AM
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నిర్మాణ పనులు సకాలంలో పూర్తికావడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో హడావుడిగా పనుల ప్రతిపాదన చేయడం, ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికాకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండడం మామూలైపోయింది.
డిసెంబరులోపు అనుమతి పొందాలి
ఆర్థిక సంవత్సరం ముగిశాక పనులు చేయొద్దు
కేంద్రం మార్గదర్శకాలు.. అమలుకు కసరత్తు
హైదరాబాద్/పెద్దపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నిర్మాణ పనులు సకాలంలో పూర్తికావడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో హడావుడిగా పనుల ప్రతిపాదన చేయడం, ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికాకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండడం మామూలైపోయింది. ఇకనుంచి ఇలాంటి సమస్యలు లేకుండా నిర్దేశించిన గడువు మార్చిలోపు పనులు పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో నిర్వహించిన మధ్యంత సమీక్ష సమావేశంలో.. ఏటా మార్చి నెలలోపు మెటీరియల్ కాంపొనెంట్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇందుకోసం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు ఆర్థిక సంవత్సరం ముగిశాక పాత పనులు చేపట్టడం కుదరదు. ఉపాధి హామీ కింద చేపట్టే ఏ పనులైనా మార్చి నెలలోనే పూర్తయ్యేలా ఇప్పటినుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స విభాగం, జిల్లాల అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మెటీరియల్ కాంపొనెంట్ కింద వచ్చే నిధులను శాశ్వత నిర్మాణ పనులకు వినియోగించాలని సూచించింది. గతంలో మాదిరిగా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ప్రతిపాదనలు చేయకుండా.. డిసెంబరులోపు ఆయా పనులు చేపట్టేందుకు అనుమతి పొందాలని స్పష్టం చేసింది. మెటీరియల్ కాంపొనెంట్ కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం తదితర పనులకు డిసెంబరులోపు ప్రతిపాదించి.. మార్చి నెలాఖరులోగా పూర్తిచేసేలా కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రత్యేకదృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 53.05 లక్షల జాబ్ కార్డులను జారీ చేయగా, వీటిపై 110.79 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. జాబ్‌కార్డు కలిగిన వారందరికీ ఏడాదిలో తప్పనిసరిగా 100రోజుల పనిదినాలను కల్పించాలనే నిబంధన ఉంది.