Share News

Government Guarantees: ‘టీజీ క్యాబ్‌’కు రూ.5000 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ రుణం !

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:20 AM

ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌(టీజీక్యాబ్‌)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) అంగీకరించింది.

Government Guarantees: ‘టీజీ క్యాబ్‌’కు రూ.5000 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ రుణం !

  • జాతీయ సహకారాభివృద్ధి సంస్థ అంగీకారం

  • రుణమాఫీకి వాడొద్దంటూ షరతు

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌(టీజీక్యాబ్‌)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) అంగీకరించింది. అయితే, ఈ నిధులను రుణ మాఫీకి వినియోగించకూడదని, మూలధన నిధి(క్యాపిటల్‌ ఫండ్‌)కి లేదా రైతులకు రుణాలు ఇవ్వడానికే వాడాలని షరతులు పెట్టింది. ఈ రుణానికి సంబంధించిన వడ్డీ రేటుపై ప్రస్తుతం ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రైతు రుణ మాఫీ కోసం ప్రభుత్వం నిధుల వేట సాగిస్తున్న సంగతి తెలిసిందే.


ఇందులో భాగంగా ఎన్‌సీడీసీ నుంచి రూ.10 వేల కోట్ల రుణం కోరుతూ టీజీక్యాబ్‌ ద్వారా దరఖాస్తు చేయించింది. బడ్జెట్‌ ఆవల తీసుకునే ఈ రుణానికి గ్యారెంటీ ఇస్తానని తెలిపింది. దాంతో ఐదేళ్ల కాలపరిమితితో పది శాతం వడ్డీ రేటుతో రూ.5000 కోట్లు రుణం ఇవ్వడానికి ఎన్‌సీడీసీ సమ్మతించినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఆర్‌బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న బహిరంగ మార్కెట్‌ రుణాలపై వర్తించే వడ్డీ 8 శాతం లోపే ఉంటుంది. దాంతో ఎన్‌సీడీసీని కూడా వడ్డీ రేటును తగ్గించాలని కోరుతున్నారు. నిజానికి, ప్రభుత్వ గ్యారెంటీ రుణాలపై ప్రస్తుతం నిషేధం అమలులో ఉంది.


వివిధ కార్పోరేషన్లకు ప్రభుత్వ గ్యారెంటీలతో తీసుకుంటున్న రుణాలకు బడ్జెట్‌ నుంచే కిస్తీలు, వడ్డీలు చెల్లిస్తుండటంతో వాటిని బడ్జెట్‌ అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇదివరకే చెప్పింది. 2021-22 నుంచి ఈ గ్యారెంటీ రుణాలను నిషేధించింది. గ్యారెంటీ రుణాలు ఇవ్వొద్దంటూ అన్ని బ్యాంకులను ఆదేశించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడేళ్లుగా ఏ కార్పొరేషన్‌కూ గ్యారెంటీ ఇవ్వలేదు. కానీ, రైతురుణ మాఫీ పథకానికి రూ.26వేల కోట్లు కావాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం గ్యారెంటీకి ముందుకొచ్చింది.

Updated Date - Jul 27 , 2024 | 04:20 AM