Sircilla: స్వశక్తి చీరలతో నేతన్నకు భరోసా
ABN , Publish Date - Sep 22 , 2024 | 04:12 AM
రాష్ట్రంలోని స్వశక్తి పొదుపు సంఘాల్లో ఉన్న 63 లక్షల మంది మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున అందిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా సంఘాల సభ్యులకు సంవత్సరానికి రెండేసి చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఏటా 1.3 కోట్ల మేర చీరలకు ఆర్డర్ ఇచ్చే అవకాశం
ఇప్పటికే పాఠశాల విద్యార్థుల యూనిఫాంకు ఆర్డర్
సిరిసిల్ల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్వశక్తి పొదుపు సంఘాల్లో ఉన్న 63 లక్షల మంది మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున అందిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏటా కోటి వరకు బతుకమ్మ చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిన దాని ప్రకారం ఏటా 1.30కోట్ల వరకు చీరలు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. ఈ లెక్కన ఏటా 7-8 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అక్టోబరు మొదటి వారంలోనే టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిధులను ఖర్చు చేయాలని భావిస్తోంది.
చీరల తయారీకి డిజైన్లను ఇవ్వాలని నిఫ్ట్‌తోపాటు మరో రెండు సంస్థల నుంచి డిజైన్లను ఆహ్వానించింది. గతంలో బతుకమ్మ చీరలకు రూ.350కోట్ల వరకు ఖర్చు చేస్తే ఈ సారి అంతకంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాతబకాయిలను విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తుండడంతో పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో పూర్తిస్థాయిలో మగ్గాలు నడవని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల నేత కేకే మహేందర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రావాల్సిన బతుకమ్మ చీరలు, ఇతర బకాయిలను కొంతమేరకు ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం విద్యార్థుల యూనిఫాం ఉత్పత్తి ఆర్డర్లతో మళ్లీ మగ్గం చప్పుళ్లు మొదలయ్యాయి. టెక్స్‌టైల్ పార్కుకు అదనంగా 49.94 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. పూర్తయ్యే దశలో ఉన్నాయి.
విద్యుత్ సమస్య పరిష్కారమయ్యేనా?
ప్రభుత్వ ఆర్డర్లతో కోలుకుంటున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ రాయితీ సమస్య వెంటాడుతూనే ఉంది. 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 50శాతం విద్యుత్ రాయితీని ప్రకటించింది. అప్పటి నుంచి రాయితీ కొనసాగుతోంది. కేటగిరీ-4 కింద యూనిట్‌కు రూ.4 ఉండగా... ఇందులో ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుంది. 10 హెచ్‌పీ విద్యుత్ వినియోగించుకునే వారికే ఇది వర్తింజేస్తున్నారు. ఆపైన సామర్థ్యంతో కొనసాగే మరమగ్గాల కార్ఖానాలు యూనిట్‌కు రూ.7.80 చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.