Share News

Hyderabad: హోంగార్డులు ఎంతమంది?

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:24 AM

ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి హోంగార్డుల్ని నియమించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా మొత్తం హోంగార్డుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

Hyderabad: హోంగార్డులు ఎంతమంది?

  • లెక్క తేల్చే పనిలో ఉన్నతాధికారులు

  • యూనిట్ల వారీగా వివరాల సేకరణ

  • ట్రాఫిక్‌ విఽధులకు సర్దుబాటు

  • నూతన నియామకాలకూ అవకాశం

  • ఓడీ, కారుణ్య నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్న హోంగార్డులు

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి హోంగార్డుల్ని నియమించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా మొత్తం హోంగార్డుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. యూనిట్ల వారీగా ఎంతమంది హోంగార్డులు ఉన్నారు, ఎంత కాలంగా పనిచేస్తున్నారు, ఆయా కార్యాలయాల్లో వారి రోజువారి పని ఏమిటి? ఇలా ప్రత్యేక ఫార్మాట్‌లో వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హోంగార్డుల సేవల్ని సర్దుబాటు చేయడంతోపాటు కొత్తగా ఎంతమందిని నియమించాల్సి ఉంటుందనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు ఈ వివరాలు సేకరిస్తున్నారు. కొత్త హోంగార్డుల నియామకంపై సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న హోంగార్డులు మరోవైపు ఇప్పటికే ఇతర విభాగాల్లో(ఓడీ) విధులు నిర్వహిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల మంది హోంగార్డులు ఆయా ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అందులో సుమారు రెండు వేల మంది హోంగార్డులు ఓడీ విధుల్లో ఉన్నారు. కొత్తగా చేపట్టే నియామకాల్లో ఓడీ హోంగార్డుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వారికి రెగ్యులర్‌ డ్యూటీలు ఇవ్వాలని కోరుతున్నారు. 2015 నుంచి కారుణ్య నియామకాలు నిలిచిపోయాయని, కరోనా, అలాగేవిధి నిర్వహణ సమయాల్లో వందలాది హోంగార్డులు మృతి చెందారని, ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో హోంగార్డులు రమేష్‌, రవీందర్‌ ఆత్మహత్య చేసుకున్న సమయంలో గాంధీ ఆస్పత్రి వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంగార్డుల్ని రెగ్యులరైజ్‌ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 03:24 AM