Share News

Health Department: దవాఖానాలకు తరలిన వైద్యశాఖ హెచ్‌వోడీలు

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:20 AM

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులను సస్పెండ్‌ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖలో ఒక్కసారిగా కదలిక వచ్చింది.

Health Department: దవాఖానాలకు తరలిన వైద్యశాఖ హెచ్‌వోడీలు

  • క్షేత్రస్థాయిలో జ్వర, డెంగీ కేసుల తీవ్రతపై ఆరా

  • రోగులతో మాట్లాడి వివరాల సేకరణ

హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులను సస్పెండ్‌ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. విభాగాధిపతులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశానుసారం బుధవారం ఆశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రుల పరిశీలనకు వెళ్లారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడారు.


సీజనల్‌ వ్యాధుల కట్టడికి సరైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయడంలో ప్రజారోగ్య సంచాలకులు పూర్తిగా విఫలమయ్యారని, రాష్ట్రంలో రోజురోజుకు డెంగీ కేసులు పెరుగుతున్న ప్రజారోగ్య విభాగం కనీస చర్యలకు కూడా ఉపక్రమించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలను సర్కారు తీవ్రంగా పరిగణించింది. మంగళవారం మంత్రి దామోదర ఉన్నతాధికారులతో సమీక్షలో... వైద్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం వివిధ దవాఖానలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ మేరకు హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.


దీంతో బుధవారం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించారు. వైద్య, విద్య సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.వాణి కోఠీ జిల్లా దవాఖానాను, గాంధీ ఆస్పత్రిని తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌, డీపీహెచ్‌ రవీందర్‌ నాయక్‌ ఉస్మానియాను సందర్శించారు. జ్వర, డెంగీ కేసుల నమోదుపై ఆరా తీశారు. ఆయా దవాఖానల్లో వసతులు, పరికరాలు, మందుల నిల్వ వంటివి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో డెంగీ అంత తీవ్రంగా లేదని వారు సర్కారుకు నివేదిక ఇచ్చారు. గురువారం సైతం వారు హైదరాబాద్‌ శివారులోని దవాఖానల్లో పర్యటించనున్నారు.

Updated Date - Aug 29 , 2024 | 03:20 AM