Share News

CM Revanth :బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

ABN , Publish Date - May 11 , 2024 | 07:37 AM

ప్రస్తుతం మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి జరుగుతోందని.. ఎవరైనా పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చుపెడతారని, పొద్దున లేస్తే మనుషుల మధ్య పంచాయితీలుంటాయని....

CM Revanth :బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

వారి పాలనలో ఉన్న యూపీనే ఉదాహరణ.. అక్కడికి పెట్టుబడులు, కంపెనీలు వెళ్లటం లేదు

ఢిల్లీ సుల్తాన్‌లతో డీకే అరుణ కుమ్మక్కు

రైతుభరోసా ఇచ్చాం..

కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా? : రేవంత్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రస్తుతం మన రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయని, అభివృద్ధి జరుగుతోందని.. ఎవరైనా పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చుపెడతారని, పొద్దున లేస్తే మనుషుల మధ్య పంచాయితీలుంటాయని, దీంతో ఎక్కడి అభివృద్ధి అక్కడ ఆగిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రం విధ్వంసం అవుతుందని, వందేళ్ళు వెనక్కి పోతుందన్నారు. దీనికి బీజేపీ పాలనలో ఉన్న ఉత్తర్‌ప్రదేశే అతి పెద్ద ఉదాహరణ అని చెప్పారు.

ఆ రాష్ట్రం నుంచి స్వయంగా ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. సీఎం పదవిలో యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నా.. అక్కడికి పెట్టుబడులు, కార్పొరేట్‌ కంపెనీలు వెళ్లటం లేదని తెలిపారు. బీజేపోళ్ళు నిత్యం పెట్టే మతచిచ్చు పంచాయితీలతో, వాళ్ళు చిమ్మే విషంతో యూపీ సర్వనాశనమైపోయిందన్నారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో మౌలిక సదుపాయాలున్నా కూడా ఆ ప్రాంతం యూపీలో భాగంగా ఉన్నందున.. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా అక్కడికి వెళ్లటం లేదని తెలిపారు. దీని గురించి తెలంగాణలో ప్రతి ఓటరు తీవ్రంగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభలో, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో భారీ రోడ్‌ షో అనంతరం జరిపిన కార్నర్‌ మీటింగ్‌లో, హైదరాబాద్‌లో జరిపిన రోడ్‌షోలలో సీఎం ప్రసంగించారు. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ విద్వేషాలు రగిలిస్తోందని, గొడవలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించి హైదరాబాద్‌ పెట్టుబడులను గుజరాత్‌కు తరలించడానికి కుట్ర పన్నిందన్నారు. కర్ఫ్యూలు వస్తే జీవితాలు అతలాకుతలం అవుతాయని, హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 20 ఏళ్లుగా హిందూ, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఈ మత సామరస్యం నేపథ్యంలోనే నగరానికి ఐటీ సంస్థలు, భారీ కంపెనీలు వచ్చాయని తెలిపారు. పాతబస్తీ ప్రజలు కర్ఫ్యూలు మరిచిపోయారని, వినాయక చవితి, రంజాన్‌ కలిసి మెలిసి జరుపుకొంటున్నామని సీఎం గుర్తు చేశారు. విద్వేష ప్రసంగాలు వినొద్దని, ఈ ప్రాంతం మనదని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. ‘బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఒక తీర్పులాంటిది. బీజేపీ కుట్ర, ఆలోచన ఒకటే 400 సీట్లు రావాలి.. రాజ్యాంగాన్ని మార్చాలి.. రిజర్వేషన్లు రద్దు చేయాలి’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లు కావాలంటోందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రె్‌సను గెలిపించాలని కోరారు.


తెలంగాణ ప్రజలకు నిరాశ

ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ ఏ వరాలు ఇవ్వకుండా, కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించి వెళ్లిపోయారని సీఎం విమర్శించారు. ప్రధానిమంత్రి వస్తున్నారంటే రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, గతంలో ప్రకటించిన ఐటీఐఆర్‌, వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఖమ్మం ఉక్కు కర్మాగారం, కొత్త రైల్వే లైన్లు, తదితర అభివృద్ధి పనులు ప్రకటిస్తారని ఆశిస్తే, తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిల్చి పోయారన్నారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న డీకే అరుణ రాజకీయంగా ఉన్నత పదవులు పొంది ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ‘మోదీ నేడు పాలమూరుపై దండయాత్ర చేసి ఉండొచ్చు. కానీ, మన ఇంటిదొంగలే బొడ్లో కత్తిపెట్టుకొని తిరుగుతున్నారు. 70 ఏళ్ళ తర్వాత పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చినప్పుడు.. జెండాలకు అజెండాలకు రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి ఏకం కావాల్సిన సమయంలో, కాంగ్రె్‌సను ఓడగొట్టాలని కత్తి పట్టుకొని డీకే అరుణ ఢిల్లీ సుల్తాన్‌ల పంచన చేరారు. ఆమెను గెలిపిస్తే మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తాడు. అక్రమ కేసులు పెట్టిస్తాడు’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌ తన కూతురు బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి దొరికినంత దోచుకుతిన్నారని దుయ్యబట్టారు. రైతుభరోసాపై కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని.. కానీ, ఈ నెల 9వ తేదీ లోపు రైతులందరికీ రైతుభరోసా అందజేసి, తాను ఇచ్చిన మాటను నిటబెట్టుకున్నానని, ఇందుకు కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా అని సీఎం సవాల్‌ విసిరారు. ఆగస్టు 15లోపు రైతుల రూ.2లక్షల రుణమాఫీ కూడా చేస్తానని, అప్పుడు సిద్దిపేట శనేశ్వర్‌రావు శని కూడా తొలగించుకుంటానని హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మెజారిటీ తెచ్చినోళ్ళకే స్థానికసంస్థల్లో అవకాశాలు

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో పోలింగ్‌ బూత్‌లలో మెజారిటీ తెచ్చిన వాళ్ళకే స్థానిక సంస్థలలో అవకాశాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని గుర్తు చేశారు. పార్టీ తరఫున కష్టపడ్డోళ్ళకే అవకాశం ఉంటది తప్ప తెల్లచొక్కాలు వేసుకొని తన చుట్టూ తిరిగి ఓట్లు తేని వారికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న సమీర్‌ వలీవుల్లాతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గోషామహల్‌లో, బేగంబజార్‌లో జరిగిన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2024 | 07:38 AM