Group-1 Posts: గ్రూప్-1కు తగ్గుతున్న పోటీ
ABN , Publish Date - Oct 26 , 2024 | 03:32 AM
గ్రూప్-1 పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. 1:50 నిష్పత్తితో మొదలైన ఈ పోటీ ప్రస్తుతం 1:37 నిష్పత్తికి చేరుకుంది.
1:50 నుంచి 1:37కి పడిన నిష్పత్తి.. పరీక్షలు ముగిసేసరికి మరింతమంది గైర్హాజరు
కొత్త ఉపాధ్యాయులు వచ్చాక చాలా స్కూళ్లలో మిగులు టీచర్ల సమస్య
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. 1:50 నిష్పత్తితో మొదలైన ఈ పోటీ ప్రస్తుతం 1:37 నిష్పత్తికి చేరుకుంది. పరీక్షలు ముగిసే నాటికి ఈ నిష్పత్తి మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందులో భాగంగా ప్రస్తుతం మెయిన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభమైన ఈ పరీక్షలు 27వ తేదీతో ముగుస్తాయి. ప్రతి అభ్యర్థి అన్ని పరీక్షలను రాయాల్సి ఉంటుంది. ఏ ఒక్క పరీక్ష రాయకపోయినా... సదరు అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోరు. మొదటి రోజు ఇంగ్లిష్ క్వాలిఫై పరీక్షలను నిర్వహించారు. తర్వాత వరుసగా సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి రోజు 74 శాతం ఉన్న అభ్యర్థుల హాజరు శాతం ఈ నెల 25వ తేదీ నాటికి 67.4 శాతానికి పడిపోయింది.
ప్రిలిమనరీ పరీక్షలో ప్రతిభ చాటిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు ఎంపిక చేశారు. ఇలా 31,403 మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేశారు. ఇందులో శుక్రవారం 21,195 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. అంటే.. ఒక్కో పోస్టుకు 37 మంది మాత్రమే మిగిలారు. మరో రెండు రోజుల పాటు పరీక్షలు ఉన్నాయి. ఈ రెండు పరీక్షలకు మరింత మంది గైర్హాజరయ్యే అవకాశం ఉంది. దాంతో ఈ నిష్పత్తి అంటే.... పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది. గ్రూపు-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో పకడ్బందీ చర్యలను తీసుకుంటున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాల విషయంలో అనేక జాగ్రతలను తీసుకుంటున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా పరీక్ష కేంద్రాలకు పంపించే ప్రశ్న పత్రాలను తెరిచే విషయంలో కూడా జాగ్రత్తలను పాటిస్తున్నట్లు వెల్లడించారు.
మిగులు టీచర్ల సర్దుబాటు
డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అందుబాటులోకొచ్చాక చాలా స్కూళ్లల్లో మిగులు (సర్ప్లస్) టీచర్ల సమస్య తలెత్తింది. దీనిని పరిష్కరించడానికి వీలుగా తాత్కాలిక సర్దుబాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శనివారం ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో కొత్తగా 10 వేల మంది ఉపాధ్యాయులకు పైగా కొత్తగా అందుబాటులోకొచ్చిన విషయం తెలిసిందే. వీరందరికి ఈ నెల 15వ తేదీన పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆయా స్కూళ్లల్లో ఉన్న పోస్టులకు అనుగుణంగా ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ పోస్టింగ్‌ల జారీ సమయంలో చాలా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా పలు స్కూళ్లల్లో సరైన సంఖ్యలో విద్యార్థులు లేకున్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు జారీ చేశారు. దాంతో అనేక పాఠశాలల్లో సర్ప్లస్ టీచర్ల సమస్య తలెత్తింది.
ఒక్క సిరిసిల్లా జిల్లాల్లోనే సుమారు 238 మంది ఉపాధ్యాయులను మిగులుగా గుర్తించారు. ఇలా అన్ని జిల్లాలో ఈ సమస్య తలెత్తింది. దీనిని నివారించడానికి ఈ మిగులు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించాలని భావిస్తున్నారు. తాత్కాలిక సర్దుబాటు పేరుతో శనివారం ఉత్తర్వులను ఇవ్వడానికి అన్ని జిల్లా కలెక్లర్లు ఏర్పాట్లను చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఈ మిగులు ఉపాధ్యాయులను పంపించే అవకాశం ఉంది. కాగా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల జాయినింగ్ తేదీని ఈ నెల 10గా పరిగణించాలని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. ఈ మేరకు ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలోని మండల విద్యా అధికారుల (ఎంఈవో)కు ఈ నెల 29వ తేదీన ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.