Mahesh Kumar Goud: కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు..
ABN , Publish Date - Sep 26 , 2024 | 04:05 AM
రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ, కుల గణన కోసం అవసరమైన విధివిధానాలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచుతాం
గణన తర్వాతే స్థానిక ఎన్నికలు
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ, కుల గణన కోసం అవసరమైన విధివిధానాలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు. బుధవారం బేగంపేటలోని ఓ హోటల్‌లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధివిధానాలు విడుదలైన వారం, పది రోజుల్లో కుల గణన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని చెప్పామని, దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తామనీ, బీసీల్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
అధికారంలో ఉన్న పదేళ్లు బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ ఇపుడు కుల గణన గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు అధికారంలో ఉన్న సమయంలో ఈ పని ఎందుకు చేయలేదని మహేశ్ గౌడ్ నిలదీశారు. దేశవ్యాప్తంగా కుల గణన చేసే అవకాశం ఉన్న బీజేపీ ఆ మాట మాట్లాడకుండా, రాష్ట్రంలో మాత్రం కుల గణన చేయాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ ప్రధానిగా మోదీ బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే సామాజిక రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పించాలన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణనను తక్షణం నిర్వహించి కాంగ్రెస్ బీసీల ఆదరణ పొందాలని, లేకుంటే అభాసుపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని తాము ఆరు నెలలుగా ఉద్యమం చేపట్టామని, హైకోర్టులో కేసు కూడా వేశామని తెలిపారు. చివరకు కులగణన మార్చ్‌కు పూనుకొని హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నామనీ, కాంగ్రె్‌సతో జరిగిన చర్చల మేరకు దాన్ని వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు. మాట ప్రకారం ప్రక్రియ ప్రారంభించపోతే ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కుండారం గణేష్ చారి, బాలగాని బాలరాజు గౌడ్, బైరి రవి కృష్ణ, ప్రొఫెసర్ బాగయ్య, తదితరులు పాల్గొన్నారు.