Share News

Hyderabad: ఎన్‌హెచ్‌ 161ఏఏ..

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:02 AM

ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకుపడుతోంది. రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా.. అక్టోబరులో ఉత్తర భాగం పనులు మొదలుకానున్నాయి. నిర్మాణం ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నంబరు (వర్కింగ్‌ టైటిల్‌) ఇవ్వాల్సి ఉంటుంది.

Hyderabad: ఎన్‌హెచ్‌ 161ఏఏ..

  • ప్రాంతీయ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి నంబరు!

  • ప్రస్తుతానికి పనులకే..! ఇదే ఖరారు కావొచ్చు కూడా

  • పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే నిర్మాణం

హైదరాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకుపడుతోంది. రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా.. అక్టోబరులో ఉత్తర భాగం పనులు మొదలుకానున్నాయి. నిర్మాణం ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నంబరు (వర్కింగ్‌ టైటిల్‌) ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి నేషనల్‌ ‘హైవే-161ఏఏ’ సంఖ్యను కేటాయించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ సమాచారం ఇచ్చింది. ప్రస్తుతానికే కాక.. నిర్మాణం అనంతరం సైతం ఇదే నంబరు ఖరారు కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి జాతీయ రహదారి నంబరును ఇస్తున్నామని కేంద్రం గతంలోనే చెప్పినా అమలుకు నోచుకోలేదు.


దీనికి మార్గమధ్యంలోని విద్యుత్తు, టెలిఫోన్‌, నీటి పైప్‌లైన్లు (యుటిలిటీస్‌) తదితరాల తరలింపునకు చెల్లించాల్సిన రూ.363 కోట్లు, భూసేకరణ వాటా మంజూరు జాప్యం అడ్డంకిగా మారాయి. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టింది. కేంద్రంతోనూ పలుసార్లు చర్చలు జరిపింది. అనంతరం యుటిలిటీ చార్జీలను కేంద్రమే భరిస్తామని హామీ ఇచ్చింది. భూ సేకరణ వాటాను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి నంబరు ఇస్తామని ప్రకటించింది. ఈలోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో జాప్యం జరిగింది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆగస్టులో టెండర్లు పిలిచే అవకాశం ఉందని మే నెలలోనే ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది.


మార్పులు చేర్పులుండొచ్చు..

కేంద్రం సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఉత్తర భాగానికి రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ 161ఏఏ నంబరును తాత్కాలికంగా కేటాయించింది. తుది అనుమతి రానందున వర్కింగ్‌ టైటిల్‌ నంబరుగానే పరిగణించనున్నారు. నిర్మాణం పూర్తయ్యేలోగా మార్పుచేర్పులకూ అవకాశం లేకపోలేదని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, జగదేవపూర్‌, ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకు ఆరు ప్యాకేజీల్లో 161 కిలోమీటర్ల మేర సాగనుంది. దక్షిణ భాగం చౌటుప్పల్‌ నుంచి ఆమనగల్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు (189 కిలోమీటర్లు) నిర్మాణం కానుంది. ముందుగా.. కేంద్రం ఉత్తర భాగానికి అనుమతిచ్చింది. ఇందులో 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ చేంజ్‌లు, ఆరుచోట్ల విశ్రాంత ప్రదేశాలు ఏర్పాటు కానున్నాయి. దాదాపు 187 చిన్న, మధ్య, భారీ అండర్‌ పాస్‌లు, నాలుగు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి, 27 పెద్ద, 80 చిన్న వారధులు, 404 బాక్స్‌ కల్వర్టులను నిర్మించాల్సి ఉంది.


అదే అలైన్‌మెంట్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం అలైన్‌మెంట్‌లో మార్పులుంటాయని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అదేమీ లేదని స్పష్టమైంది. వాస్తవానికి సంగారెడ్డి-చౌటుప్పల్‌ వరకు రహదారి మ్యాప్‌ గతంలోనే సిద్ధమైంది. 90 శాతం భూసేకరణ జరిగింది. నర్సాపూర్‌ దగ్గర అటవీ భూములు ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంత ప్రజలు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ రెండుచోట్ల సేకరణ జాప్యమైంది. అదే సమయంలో కేంద్రం నిబంధనల మేరకు అలైన్‌మెంట్‌ మార్పునకూ అవకాశం లేదు. దీంతో రాయగిరి ప్రజలను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ప్రాంతీయ రింగు రోడ్డు రెండు భాగాలు ఒకేలా నిర్మాణం కానున్నాయి. ఉత్తర భాగం పనులు మొదలుపెట్టే సమయానికి దక్షిణం వైపు అలైన్‌మెంట్‌, డీపీఆర్‌లను సిద్ధం చేసేలా అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. మొత్తంగా మూడేళ్లలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Updated Date - Jun 21 , 2024 | 05:02 AM