Share News

NHAI: ట్రామాకేర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ మోకాలడ్డు!

ABN , Publish Date - Aug 23 , 2024 | 04:20 AM

నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మోకాలడ్డడంతో నిర్మాణ సంస్థ ఆటోమెటిక్‌ డేటా ప్రాసెస్‌ (ఏడీపీ) పనులను నిలిపేసింది.

NHAI: ట్రామాకేర్‌కు ఎన్‌హెచ్‌ఏఐ మోకాలడ్డు!

  • తాము సేకరించిన స్థలంలో పనులపై ఎన్‌హెచ్‌ఏఐ ఆగ్రహం

  • ఏడీపీకి సంస్థకు నోటీసులు.. నిలిచిన పనులు

కేతేపల్లి, ఆగస్టు 22: నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మోకాలడ్డడంతో నిర్మాణ సంస్థ ఆటోమెటిక్‌ డేటా ప్రాసెస్‌ (ఏడీపీ) పనులను నిలిపేసింది. రైతులకు పరిహారం చెల్లించి తాము సేకరించిన భూమిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏడీపీకి ఎన్‌హెచ్‌ఏఐ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఏడీపీ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కింద రూ.5 కోట్ల నిధులతో ప్రమాదకర రోడ్డుగా పేరున్న 65వ నంబర్‌ హైవేపై కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ఎకరా విస్తీర్ణంలో ట్రామా కేర్‌ సెంటర్‌ నిర్మించ తలపెట్టింది.


ఈ పనులకు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత నెల 8న ఏడీపీ ఇండియా హెడ్‌ విజయ్‌ వేములపల్లితో కలిసి భూమి పూజ చేశారు. పనులను 2 నెలల్లో పూర్తి చేసి సెప్టెంబరులోనే ట్రామాకేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని మంత్రి అప్పటి సభలో ప్రకటించారు. ఇటు పనులు ప్రారంభించిన ఏడీపీ సంస్థ ప్రతినిధులు పిల్లర్లకు ఫుటింగ్‌లు, పిల్లర్‌ బుట్టలు కట్టే పనులు పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే టోల్‌ప్లాజా ఆవరణలో ట్రామాకేర్‌ సెంటర్‌ నిర్మిస్తున్న సమాచారం తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు.. ఏడీపీ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.


అనుమతులు లేకుండా తాము సేకరించిన స్థలంలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడమేంటని.. తక్షణం పనులు నిలిపేసి స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఏడీపీ యంత్రాంగం.. భవన నిర్మాణ పనులను నిలిపేసి పిల్లర్‌ బుట్టలను గ్యాస్‌ కట్టర్లతో కట్‌ చేసి సామగ్రి అంతా తరలించి వారం రోజుల కిత్రం స్థలాన్ని ఖాళీ చేసింది. ఇదే విషయమై ఏడీపీ సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.

Updated Date - Aug 23 , 2024 | 04:20 AM