Nampally: ఆదాయం ఘనం.. అద్దెల భారం!
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:07 AM
రాజధాని నడిబొడ్డున నాంపల్లి రెడ్‌హిల్స్‌లో ఉన్న సబ్‌రిజిస్టార్ కార్యాలయానికి ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదనే కారణంతో కరెంట్ కట్ చేయడం చర్చనీయాంశమైంది.
144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 37 ఆఫీసులకే సొంత భవనాలు
107 ఆఫీసులకు స్థలాలు ఇవ్వాల్సి ఉన్నా.. 57 కార్యాలయాలకే కేటాయింపు
రాష్ట్రంలో అద్దె బకాయిలు 2.97 కోట్లు
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాజధాని నడిబొడ్డున నాంపల్లి రెడ్‌హిల్స్‌లో ఉన్న సబ్‌రిజిస్టార్ కార్యాలయానికి ఆరు నెలలుగా అద్దె చెల్లించడం లేదనే కారణంతో కరెంట్ కట్ చేయడం చర్చనీయాంశమైంది. వెంటనే భవనం ఖాళీ చేయాలని యజమాని హుకుం జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 144 కార్యాలయాలు ఉండగా 107 కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. 37 ఆఫీసులు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చే శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ కీలకమైంది. నిత్యం రూ. వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న శాఖలో ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతూ ఉద్యోగులు పని చేస్తున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖకు ఘనమైన చర్రిత ఉంది. 1864 నుంచి ఈ శాఖ పని చేస్తుంది. ఇన్ని దశాబ్దాలు గడిచినా నేటికీ సొంత భవనాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము, ట్రాన్స్ఫర్ డ్యూటీ రూపంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలో 60 శాతం కార్యాలయాలు అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో ఆరుగురు డీఐజీలు ఈ శాఖకు పని చేస్తున్నారు. అందులో నాలుగు సొంత భవనాలు ఉండగా 2 చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నారు. జిల్లా రిజిస్టార్లకు సంబంధించి 12 మంది పని చేస్తుంటే అందులో 11 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలాల కేటాయింపులు సక్రమంగా చేపట్టలేదు. అద్దెభవనాల్లో న్న 107 సబ్‌రిజిస్టార్ కార్యాలయాలకు అవసరమైన భవనాలు నిర్మించేందుకు కేవలం 57 కార్యాలయాలకే స్థలాలున్నాయి.
ఇంకా 50 కార్యాలయాలకు స్థలాలు చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఆ శాఖ మంత్రి పొంగులేటి అధికారులతో మాట్లాడుతూ తక్షణమే సొంత భవనాలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు సంబంధించి రూ. 2,96,53,776 కోట్ల అద్దె బకాయిలున్నాయి. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.1,00,14,809 కోట్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రూ.48.35 లక్షలు, హైదరాబాద్ సౌత్ పరిధిలో రూ.40 లక్షలు, హైదరాబాద్ పరిధిలో రూ.9 లక్షలు, మహబూబ్‌నగర్ పరిధిలో రూ.19.37 లక్షలు, వరంగల్ రూ.10.08లక్షలు, నిజామాబాద్ రూ.46లక్షలు, ఆదిలాబాద్ రూ.4.15లక్షలు, కరీంనగర్ రూ.5.75 లక్షల బకాయిలు ఉన్నాయి.