Share News

Narayanpet: గుడిలో దళితుల పెళ్లికి పూజారి అభ్యంతరం

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:39 AM

పెళ్లి చేసుకుందామని కుటుంబసభ్యులతో ఆలయానికి వచ్చిన ఓ దళిత జంటకు నిరాశ ఎదురైంది. ఆలయం లోపల వివాహం చేసుకునేందుకు అనుమతించమంటూ పూజారి ఆ గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు.

Narayanpet: గుడిలో దళితుల పెళ్లికి పూజారి అభ్యంతరం

  • ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయిన వైనం

  • గేటు ముందే ఆ జంటకు పెళ్లి చేసిన పూజారి కుమారుడు

కృష్ణ, ఆగస్టు 18: పెళ్లి చేసుకుందామని కుటుంబసభ్యులతో ఆలయానికి వచ్చిన ఓ దళిత జంటకు నిరాశ ఎదురైంది. ఆలయం లోపల వివాహం చేసుకునేందుకు అనుమతించమంటూ పూజారి ఆ గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ పూజారి కుమారుడే ఆలయ గేటు వద్ద ఆ జంటకు పెళ్లి చేశారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్‌ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.


ముడుమాల్‌కు చెందిన ఓబులేశ్‌, హిందూపూర్‌ గ్రామానికి చెందిన పద్మతో ఆదివారం 10.30 గంటలకు గ్రామంలోని యాదవేంద్రస్వామి ఆలయంలో వివాహం చేసేందుకు ఇరుకుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఇరుకుటుంబాల వారు ఆదివారం ఉదయమే వధూవరులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. అయితే, ఆలయంలో పెళ్లికి పూజారి చక్రపాణి అభ్యంతరం తెలపగా.. పెళ్లికి వచ్చిన వారు అతనితో వాగ్వాదానికి దిగారు.


దీంతో పూజారి ఆలయానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పూజారి కుమారుడు వధూవరులను ఆలయం గేటు ముందు కూర్చోపెట్టి పెళ్లి తంతు పూర్తి చేశారు. దీనిపై పూజారి చక్రపాణిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. మంత్రాలయం పీఠాధిపతి ఆదేశం మేరకు ఆలయంలో పెళ్లిళ్ల నిర్వహణకు అనుమతించడం లేదని తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:39 AM