Share News

Damodar Rajanarsimha: ర్యాగింగ్‌ను ఉపేక్షించొద్దు

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:31 AM

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్‌ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Damodar Rajanarsimha: ర్యాగింగ్‌ను ఉపేక్షించొద్దు

  • ఖమ్మంలో మెడికోకు గుండు కొట్టించడంపై మంత్రి దామోదర ఆగ్రహం

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

  • కళాశాలలో ఏసీపీ విచారణ.. కేసు నమోదు

హైదరాబాద్‌, ఖమ్మం కలెక్టరేట్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్‌ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విచారణ జరిపి, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌ వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కళాశాలల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీస్‌ శాఖ సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. ర్యాగింగ్‌ ప్రభావం విద్యార్థులపై పడకుండా చూడాలన్నారు. జూనియర్లతో సీనియర్‌ విద్యార్థులు స్నేహంగా ఉండాలని, ర్యాగింగ్‌ పేరిట భయాందోళనలకు గురి చేయొద్దని హితువు పలికారు.


కాగా, ఖమ్మం మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థికి ఈ నెల 12న యాంటీ ర్యాగింగ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రెహ్మాన్‌ గుండు గీయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ప్రచురించింది. దీంతో మంత్రి దామోదర స్పందించారు. కాగా, బాధిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ర్యాగింగ్‌ నిరోధానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజేశ్వరరావును సీపీ వివరాలు అడిగినట్లు, తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరారని తెలిసింది. మరోవైపు ఏసీపీ రమణ మూర్తి, ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించారు. రాష్ట్ర వైద్య విద్య ఉన్నతాధికారులు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. మరోవైపు వైద్య కళాశాల పురుషుల వసతిగృహం ఎదుట ఆదివారం ఏఐఎ్‌సఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Updated Date - Nov 18 , 2024 | 04:31 AM