Dharani : ధరణి స్థానంలో.. భూమాత
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:15 AM
ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు,
రీ సర్వే చేపట్టి భూధార్ కార్డులు,
టైటిల్ గ్యారెంటీ అమలుకు కార్యాచరణ
కౌలుదారు చట్టం-2011 అమలు,
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు
1958కి ముందు అసైన్డ్ భూములు
నిషేధిత జాబితా నుంచి తొలగింపు
పార్ట్-బిలో ఉన్న 18 లక్షల ఎకరాల,
సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం
ధరణి కమిటీ ముసాయిదా నివేదిక
హైదరాబాద్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు, భూ వినియోగ పాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూధార్ కార్డుల అందజేత వంటి పలు సిపార్సులతో ధరణి కమిటీ ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని నివేదికలో పలు సూచనలు పేర్కొంది. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, తహసీల్దారు కార్యాలయాల్లో భూ సహాయ కేంద్రాల ఏర్పాటు, ఇప్పుడున్న అనేక భూ చట్టాలను మదింపు చేసి ఒకే చట్టం తీసుకురావడం, 1958కి ముందు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. ధరణి కమిటీ ప్రధానంగా ఆర్వోఆర్-2020 పేరుతో తీసుకొచ్చిన ధరణి చట్టంలో మార్పులు చేయడం, పోర్టల్‌లోని లోపాలను సవరించడం, ప్రైవేటు ఏజెన్సీ చేతిలో ఉన్న పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టడం, ధరణి పార్ట్-బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు సంబంధించిన కేసులు, 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది.
రాష్ట్రంలో ధరణి పోర్టల్ వల్ల సుమారు 22 లక్షలకుపైగా సమస్యలు తలెత్తాయని చెబుతూ వీటిని పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ పలు సిఫారసులు చేసింది. ఈ ఏడాది అక్టోబరుతో ప్రైవేటు ఏజెన్సీ గడువు ముగియనుండటంతో పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఏజెన్సీలు పర్యవేక్షించేలా ఇప్పటికే సర్కారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్‌ఐసీ ద్వారా ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. 2020 ఆర్వోఆర్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయిందని, గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డుల పర్యవేక్షణ, బాధ్యులు లేకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తినట్లు కమిటీ అభిప్రాయ పడింది. కొత్త ఆర్వోఆర్ చట్టం 2024ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ మేరకు రెవెన్యూ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ పలు సిఫారసులు చేసింది.
స్వల్పకాలిక సిఫారసులు
ధరణి పోర్టల్ మార్చి దాని స్థానంలో భూమాత; ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కొత్త ఏజెన్సీలకు అప్పగింత; ధరణిలో అనధికారిక కార్యక్రమాలు జరిగితే మూడో పార్టీ ద్వారా తనిఖీ; భూ సమస్యల పరిష్కారం, చట్టంలో మార్పులకు కొత్త రెవెన్యూ చట్టం; భూ పరిపాలనా సంస్కరణల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు;
మధ్యకాలిక సిఫారసులు
ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించే సదుపాయం; ఆన్‌లైన్, మొబైల్, కంప్యూటర్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేసేలా నిబంధనలు; ఈసేవ కేంద్రాలను సందర్శించకుండానే బయోమెట్రిక్ ప్రామాణికం కోసం ఆధార్‌తో అనుసంధానం; భూ ఫిర్యాదులను స్వీకరణకు గ్రామ స్థాయిలో కొత్త కార్యక్రమం; ఇప్పటికే ఉన్న బహుళ మాడ్యూల్‌ల స్థానంలో ఒకే ఫిర్యాదు మాడ్యూల్; గ్రామీణాభివృద్థి శాఖలో గతంలో కొనసాగిన కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమం పునరుద్ధరణ; గ్రామీణ యువత సహకారంతో భూరికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన, భూ సమస్యలు ఉంటే గుర్తింపు, గుర్తించిన సమస్యలను గ్రామ రెవెన్యూ కోర్టుల పరిష్కారం; తహసీల్దార్ కార్యాలయాల దగ్గర భూ సహాయ కేంద్రాల ఏర్పాటు; ఇప్పుడున్న ఆర్వోఆర్, ఇతర భూరికార్డులు పరిశీలించి తాత్కాలిక భూదార్ కార్డుల జారీ; భూవివాదాల పరిష్కార చట్టం; రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్దిష్ట సమయంలో భూ సమస్యలు పరిష్కారం జరిగేలా ప్రత్యేక విధానం; ఇప్పుడున్న అనేక భూచట్టాలను మదింపు చేసి ఒకేఒక భూచట్టం; నిఽషేదిత ఆస్తుల జాబితాను అప్‌డేట్, జాబితాలో తప్పులుంటే సవరణలు, 1958కి ముందు అసైన్డ్ భూములు నిషేదిత జాబితా నుంచి తొలగింపు; పెండింగులో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు; ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటెడ్ యాక్ట్-2011ను అమలు; కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు; భూ పరిపాలనను చూసేందుకు గ్రామస్థాయిలో ఒక వ్యకి; ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం భూములపై పకడ్బందీ జాబితా; పార్ట్-బీలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకాల జారీ.
దీర్ఘకాలిక సిఫారసులు
భూ పరిపాలన అధ్యయనం; ఖాస్రా, చేసాలా పహాణి వంటి అన్ని రకాల రికార్డులను దశలవారీగా డిజిటలైజ్ చేయడం; రీ సర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూధార్ కార్డులు; రెవెన్యూ అధికారుల్లో నైపుణ్యాల పెంపునకు ల్యాండ్ అకాడమీ; సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టరేట్లు, ఐటీడీఏ కార్యాలయాల ఆవరణల్లో లీగల్ సెల్; ల్యాండ్ పాలసీ, ల్యాండ్ వినియోగంపైనా పాలసీ; కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు.. అటవీ హక్కుల చట్టం అమల్లోకి తీసుకురావడం; టైటిల్ గ్యారెంటీ అమలు చేసేలా కార్యచరణ.