Share News

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:21 AM

చెరువు, బఫర్‌ జోన్‌లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Etala Rajender: సామాన్యుల జోలికొస్తే ఊరుకోం..

  • పెద్దల అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఓకే

  • పేదల ఇళ్లను పడగొడితే చూస్తూ కూర్చోం

  • సమస్యలపై పక్కదారికే హైడ్రా: ఈటల

మల్కాజిగిరి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): చెరువు, బఫర్‌ జోన్‌లలో నిర్మించిన పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రాతో కూల్చివేయించడం సంతోషమే కానీ.. అదే ముసుగులో సామాన్యుల నిర్మాణాలను పడగొడతామంటే ఊరుకోబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని సాహెబ్‌నగర్‌, సరూర్‌నగర్‌ చెరువు, ఫాక్స్‌సాగర్‌ చుట్టూ ఇళ్లు కట్టుకున్నవారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేయడం తగునా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే హైడ్రాను ముందుకుతెచ్చారని ఆరోపించారు. ప్రజలు దీనంతటినీ గమనిస్తున్నారని అన్నారు.


ఆదివారం మల్కాజిగిరిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో భవనాలను కూల్చే ప్రయత్నం చేసి తోక ముడిచారని, తర్వాత ఏం జరిగిందో చూశామని అన్నారు. బతుకమ్మ కుంటను పూడ్చింది ప్రభుత్వం కాదా? దమ్ముంటే ప్రభుత్వమే పూడ్చిన చెరువుల మీద చర్యలు తీసుకోవాలని ఈటల సవాల్‌ విసిరారు. అసలు ఇలాంటి చెరువులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని డిమాండ్‌ చేశారు. వాటిని తిరిగి చెరువులు గా మారుస్తారా? లేదా? అని ప్రశ్నించారు.


ఉమ్మడి ఏపీలో 40 ఏళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉందని.. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చింది కూడా ఆ పార్టీ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. రక్త సంబం ధం కన్నా పార్టీతో ఉన్న సంబంధమే తనకు ఎక్కువ అని ఈటల స్పష్టం చేశారు. మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎల్లప్పుడూ వెంటే ఉంటానన్నారు. పార్టీ పని తప్ప తనకు ఇతర పనులు లేవని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Aug 26 , 2024 | 03:21 AM