Loan Waiver: మా రుణాలు మాఫీ కాలేదు!
ABN , Publish Date - Aug 06 , 2024 | 02:43 AM
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.
సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో రైతుల ఆందోళన
మునగాల రూరల్, కోటగిరి, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని రేపాల కెనరాబ్యాంకు ఎదుట కొంతమంది రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు.
సమస్య పరిష్కరిస్తామని బ్రాంచ్ మేనేజర్ చెప్పినప్పటికీ... అక్కడి నుంచి కోదాడలోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పద్మావతిని కలిసి తమ గోడు విన్నవించారు. బ్యాంకు మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే... సాంకేతిక లోపాలుంటే సరిచేయాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని కల్లూర్‌లోని కెనరా బ్యాంకు ఎదుట రైతులు ధర్నా చేశారు. అర్హత సాధించని రైతుల జాబితాను ఉన్నతాధికారులకు పంపించి సమస్యను పరిష్కరిస్తామని ఏవో శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో శాంతించారు.