Share News

Khammam: సాగర్‌ జలాల కోసం ఎదురు చూపులు

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:42 AM

సాగర్‌ ఎడమకాల్వ రెండోజోన్‌ పరిధిలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్‌ మధిర బ్రాంచ్‌ కాల్వకు సత్వరమే సాగునీరు అందించి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Khammam: సాగర్‌ జలాల కోసం ఎదురు చూపులు

  • ఎడమ కాల్వ గండ్లను పూడ్చాలని రైతుల వేడుకోలు

  • కాల్వల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి: పొంగులేటి

కల్లూరు, కూసుమంచి సెప్టెంబరు 15: సాగర్‌ ఎడమకాల్వ రెండోజోన్‌ పరిధిలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్‌ మధిర బ్రాంచ్‌ కాల్వకు సత్వరమే సాగునీరు అందించి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి పొలాల గట్లకు గండ్లు పడి నీరు బయటకు వెళ్లిందని రైతులు వివరించారు. వరద ప్రభావంతో ఎగువన కూసుమంచి వద్ద సాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలని కోరారు. మధిర బ్రాంచ్‌ కాల్వ పరిధిలో 31వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పుడు పంట చిరు పొట్ట దశకు చేరుకుంది.


ఈ దశలో ఉన్నందున సత్వరమే సాగునీరు అందిచాలని, లేకపోతే పైరు ఎండి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బుడమేరుకు గండ్లను పూడ్చినట్టే.. కూసుమంచి వద్ద సాగర్‌ కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు మంత్రులు చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఎడమకాల్వ గండి పూడ్చివేత పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచి మండలం హట్యతండ వద్ద సాగర్‌ ఎడమకాల్వ గండిపూడ్చివేత పనులను ఆదివారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.


కాల్వకు గండ్లు పడిన ప్రదేశాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, చేపట్టనున్న శాశ్వత పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగినందున సాగులో ఉన్న పంటలు ఎండిపోకుండా వెంటనే సాగర్‌ జలాలు అందించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలూ పనులు కొనసాగించాలన్నారు. అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిప్టులవారీగా కార్మికులు పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Updated Date - Sep 16 , 2024 | 03:42 AM