Share News

Lake Protection: హైడ్రాకు హైపవర్‌..

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:58 AM

చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.

Lake Protection: హైడ్రాకు హైపవర్‌..

  • హైకోర్టు నియమించిన కమిటీ తన

  • నివేదికలో గోపన్‌పల్లిలోని గోసానికుంట

  • చెరువు గురించి పేర్కొన్న అంశాలు..

  • ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారాలు

  • నోటీసులు కూడా జారీ చేసేలా..

  • రెవెన్యూ, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ,

  • పంచాయతీరాజ్‌కు పురపాలక శాఖ లేఖ

  • చట్టంలో మార్పులా?.. అధికారాల బదలాయింపా?

  • న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు

  • హెచ్‌ఎండీఏలోని 3532 చెరువులు హైడ్రా కిందికే!

ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణలు జరిగాయి. ఫెన్సింగ్‌, రింగ్‌ బండ్‌/వాకింగ్‌ ట్రాక్‌ తదితర పనులు చేసినట్లుగా కనిపించలేదు. సీసీ కెమెరాలు లేవు. లేక్‌ గార్డులు ఎవరూ లేరు. మురుగు నీటి మళ్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్లు అసలే లేవు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాల శాఖ.. ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను ఆ సంస్థకు బదలాయించనున్నారు. ఉదాహరణకు.. ఇటీవల దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.


అయితే ఇక నుంచి నోటీసులిచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉండే అధికారాలనూ హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఆ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది.


ఈ సందర్భంగా.. ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు ఇస్తున్నాయని సీఎస్‌ తెలిపారు. ఇక నుంచి ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న ఆస్తుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతల తొలగింపునకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇవ్వనున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన బాధ్యతలను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి అప్పగించారు. ఇందుకు అనుగుణంగా.. పురపాలక శాఖ తాజాగా రెవెన్యూ సహా కీలక విభాగాలకు నోట్‌ పంపింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. హెచ్‌ఎండీఏపరిఽధిలో ఉన్న 3532 చెరువుల ఆక్రమణలపై, వాటి సంరక్షణపై పూర్తి అధికారాలు హైడ్రా పరిధిలోకే రానున్నాయి.


  • ఏయే అధికారాలను బదలాయిస్తారంటే..

తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, తెలంగాణ వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాలు, జీహెచ్‌ఎంసీ చట్టాల ద్వారా అమలు చేసే అధికారాలను, పంచాయతీరాజ్‌ పరిధిలో అమలు చేస్తున్న అధికారాలను హైడ్రా పరిధిలోకి తీసుకు రానున్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దారు ఆధ్వర్యంలో ఇస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, ఇచ్చిన నోటీసులను తొలగించే అధికారం కేవలం రెవెన్యూ అధికారులకే ఉంది. మునిసిపాలిటీ పరిధిలోనైతే ఆయా సంస్థలకు ఉంటుంది. వాటన్నింటినీ ఇప్పుడు హైడ్రాకు బదలాయించాలంటే జీవో ద్వారా చేయాలా? లేక చట్టంలో మార్పులు తేవాలా? అనే అంశంపై రెవెన్యూ అధికారులు న్యాయసలహా కోరారు.


అయితే ఓఆర్‌ఆర్‌ పరిధిలోనైతే కొన్ని అంశాల్లో చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని, మరికొన్ని అంశాలపై జీవో ద్వారా అధికారాలను బదలాయించవచ్చనే చర్చ జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు, కూల్చివేతలకు సంబంధించి ఉన్న అధికారాలను జీవో ద్వారా బదలాయించే అవకాశం ఉందని, దాని పరిధిలో లేని చోట్ల చట్టపరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎప్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ విషయంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటోంది.


ఎక్కడైనా, వాల్టా చట్టం ఉల్లంఘనలు జరిగినా, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా.. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రస్తుతం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ ఆక్రమణలకు సబంధించి కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌ పరిధిలో భూ ఆక్రమణ చట్టం-1905 ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 5, సెక్షన్‌ 6 ద్వారా భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌-1864 సెక్షన్‌ 25 ద్వారా రికవరీ నోటీసులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. అలాగే చెరువులు, కాలువల భూభాగంలో నిర్మించిన ఇళ్లపై చర్యలు తీసుకునేందుకు 2002 వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తారు. ఈ తరహా అధికారాలన్నింటినీ ఇకపై హైడ్రాకు కట్టబెట్టనున్నారు.


  • 3532 చెరువులూ హైడ్రా పరిధిలోకే..

హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 3532 చెరువులు ఉన్నాయి. వాటిలో అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఈ చెరువుల్లో ఆక్రమణలన్నింటినీ తొలగించేందుకు అవసరమైన అధికారాలను హైడ్రాకు దఖలు పరచడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. మరోవైపు వీటిలో 230 చెరువులకు సంబంధించి మాత్రమే హెచ్‌ఎండీఏ తుది నోటిఫికేషన్‌ ఇచ్చింది. మిగిలిన 2525 చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ కాగా.. తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. తుది నోటిఫికేషన్‌ ఇచ్చిన చెరువుల్లోని ఆక్రమణలను తొలగించడం, ప్రాథమిక నోటిఫికేషన్‌ వచ్చిన వాటిలో ఆక్రమణలపై కూడా దృష్టి పెట్టే దిశగా హైడ్రాను బలోపేతం చేయనున్నారని సమాచారం.

Updated Date - Sep 05 , 2024 | 02:58 AM