Share News

Hyderabad: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు..కార్పొరేట్‌ తరహాలో..

ABN , Publish Date - May 28 , 2024 | 03:46 AM

రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కెఫెటేరియాలు, వెయిటింగ్‌ లాంజ్‌లు ఇతర హంగులతో కార్పొరేట్‌ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్‌లు కట్టాలని భావిస్తోంది.

Hyderabad: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు..కార్పొరేట్‌ తరహాలో..

  • తొలి విడతలో రంగారెడ్డి, సంగారెడ్డి,

  • హైదరాబాద్‌, మేడ్చల్‌ భవనాల నిర్మాణం

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కెఫెటేరియాలు, వెయిటింగ్‌ లాంజ్‌లు ఇతర హంగులతో కార్పొరేట్‌ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్‌లు కట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బాగా ఆదాయం వచ్చే రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను తొలి విడతలో నిర్మించనున్నారు. అలాగే ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలకు తక్కువ ఆదాయం వచ్చే జిల్లాల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు.


రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు కూర్చోడానికి కుర్చీల్లేని పరిస్థితి ఇకపై ఉండకూడదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను మోడల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులున్నాయి. వీటిలో 38 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 52 చోట్ల ఆఫీసులకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కూడా కేటాయించారు.

Updated Date - May 28 , 2024 | 03:46 AM