Share News

TG Govt: హోటళ్లను బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు

ABN , Publish Date - Nov 03 , 2024 | 05:00 AM

హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రంలో హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

TG Govt: హోటళ్లను బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు

  • ప్రభుత్వం యోచన.. కసరత్తు మొదలు

  • రాష్ట్రంలో హోటళ్ల వివరాల సేకరణ

  • లెక్క తేలాక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీ

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రంలో హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని హోటళ్లు ఉన్నాయన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. హోటళ్ల సంఖ్య లెక్కతేలిన తర్వాత.. ఎన్ని హోటళ్లకు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలన్నదానిపై నిర్ణయానికి రానున్నారు. దీనిపై ఒక కమిటీని వేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్‌ చివరికి హైదరాబాద్‌లో 74,807 రెస్టారెంట్లు ఉన్నాయి.


ఇవి కాకుండాతగిన అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన హోటళ్లు, రెస్టారెంట్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఏటా ఈ హోటళ్ల ద్వారా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో ఫుడ్‌ బిజినెస్‌ జరుగుతున్నప్పటికీ హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించే విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం బాగా వెనుకబడింది. మానవ వనరుల కొరత కారణంగా పర్యవేక్షణ అసలే ఉండటం లేదు. హైదరాబాద్‌లో 74 వేల రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మందే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లున్నారు. అంటే ప్రతీ 3,552 రెస్టారెంట్లకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉన్నారన్నమాట. దీన్ని బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ అధికారి సెలవు రోజులు మినహాయించి, రోజుకు 10 చొప్పున హోటళ్లు తనిఖీ చేసినా కూడా ఒక ఏడాదిలో అన్ని హోటళ్లను తనిఖీ చేయడం అసాధ్యం. కాగా, ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని అనేక హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు నిర్వహించగా దాదాపు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తేలింది.

Updated Date - Nov 03 , 2024 | 05:00 AM