Share News

Harish Rao: కుటుంబ బంధాల్లో రేవంత్‌ సర్కార్‌ చిచ్చు

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:41 AM

రుణ మాఫీ ఆంక్షలతో కుటుంబ బంధాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిచ్చు పెట్టారని, తల్లీకొడుకులు, తండ్రీకొడుకులు, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి.. బంధాలను విచ్చిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం ఇదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: కుటుంబ బంధాల్లో రేవంత్‌ సర్కార్‌ చిచ్చు

  • 31 సాకులు చూపుతూ రుణ మాఫీకి కోతలు: హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రుణ మాఫీ ఆంక్షలతో కుటుంబ బంధాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిచ్చు పెట్టారని, తల్లీకొడుకులు, తండ్రీకొడుకులు, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి.. బంధాలను విచ్చిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం ఇదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందన్నారు. మేడ్చల్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇది ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ వర్తింపజేయాలన్న నిబంధన వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు.


సిద్దిపేట నియోజకవర్గం జక్కాపూర్‌లోని గురజాల బాల్‌రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రూ.6 లక్షల అప్పు ఉంటే కేవలం రూ.2 లక్షలే మాఫీ అవుతోందని తెలిపారు. ఇది మోసం కాదా? కేసీఆర్‌ హయాంలో ఇలాంటి నిబంధనలు ఏవైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. రుణమాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్‌ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోందని విమర్శించారు. నారాయణపేటలో నల్ల మణెమ్మ భర్త 2010లోనే చనిపోయారని, ఆయన ఆధారు కార్డు లేదన్న సాకుతో రుణమాఫీ సొమ్మును వేయకపోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. 20లక్షల మందికే ఇప్పటిదాకా రుణమాఫీ అయిందని, ఇంకా 21లక్షల మందికి చేయాల్సి ఉందని మంత్రి తుమ్మల చెబుతుంటే... మొత్తం మాఫీ చేసేశామంటూ రేవంత్‌ అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. యాసంగి వేసే టైమ్‌ వస్తున్నా.. వానాకాలం పెట్టుబడి సాయం అందించలేదని, వడ్లకు బోనస్‌ అనేది బోగ్‌సగా మారిందని ధ్వజమెత్తారు. పోలీసులను తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నానని చెప్పారు. ఇది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Sep 09 , 2024 | 03:41 AM