Harish Rao: సైన్యం, హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలి
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:53 AM
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని, సైన్యాన్ని, హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మాజీ మంత్రి హరీశ్ రావు
దేవరకొండ/హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు 1: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని, సైన్యాన్ని, హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసర సేవలు అందించేందుకు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
పూర్తిగా నిండిన చెరువులు, కాల్వలు తెగకుండా నీటి పారుదలశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న బాధితులకు బీఆర్ఎస్ శ్రేణులు సహాయక చర్యలు అందించాలని పిలుపునిచ్చారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సెలవులు రద్దు చేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్లకు నిధులు కేటాయించి సహాయక చర్యలు చేపట్టాలని విన్నవించారు. అలాగే ఇలాంటి ఆపత్కాలంలో ఒకరికొకరు భాసటగా నిలవాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.