Share News

మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:44 AM

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి.

మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం

50 వేలకు పైగా చెట్లు నేలమట్టం

8 టోర్నడో తరహా గాలులు కావచ్చు: నిపుణులు

వరంగల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్దఎ త్తున గాలిదుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 1న పరిశీలనకు వెళ్లిన అధికారులు.. ఈదృశ్యాలను చూసి, షాక్‌కు గురయ్యారు. అయితే.. టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘‘టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయి. కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి.. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చు’’ అని వివరించారు. అయితే 50 వేల చెట్లు ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీఎ్‌ఫవో రాహుల్‌ జావేద్‌ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ(ఐఎండీ), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ)తో కలిసి పరిశీలన జరుపుతోంది. మంగళవారం ఆయన.. సీసీఎఫ్‌ ప్రభాకర్‌తో కలిసి తాడ్వాయ్‌-మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు.

Updated Date - Sep 04 , 2024 | 04:44 AM