Medical Colleges: పీజీ మెడికల్ ‘స్థానికత’పై వివరణ కోరిన హైకోర్టు
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:39 AM
తెలంగాణ మెడికల్ కాలేజెస్ రూల్స్- 2021లోని రూల్ 8 (1) (2)ల చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మెడికల్ కాలేజెస్ రూల్స్- 2021లోని రూల్ 8 (1) (2)ల చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మెడికల్ పీజీ కోర్సులకు ముందు నాలుగేళ్లు తెలంగాణలో చదవలేదని పేర్కొంటూ ఈ రూల్స్ కింద తమను స్థానిక కోటాకు అనర్హులుగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ ఎస్ సత్యనారాయణ, డాక్టర్ వి.రజిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ వెలుపల ఉన్నప్పటికీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ తదితర కాలేజీల్లో చదివిన వారికి స్థానిక కోటా కింద అవకాశం ఇస్తున్నారని, వారితో సమానంగా తమను గుర్తించకపోవడం అక్రమం, వివక్ష చూపడం కిందికి వస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుల ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.