Share News

కొత్త కోర్సుల దరఖాస్తులు మళ్లీ పరిశీలించండి: హైకోర్టు

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:14 AM

కొత్త కోర్సులు ప్రారంభించే విషయమై ఇంజినీరింగ్‌ కాలేజీలు చేసుకున్న దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొత్త కోర్సుల దరఖాస్తులు మళ్లీ పరిశీలించండి: హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కొత్త కోర్సులు ప్రారంభించే విషయమై ఇంజినీరింగ్‌ కాలేజీలు చేసుకున్న దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కారణంగా కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, ఎలక్ర్టికల్స్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త కోర్సులు ప్రారంభించాలనుకుంటున్న కాలేజీలకు ఊరట లభించింది.

సరైన కారణాలను వివరించకుండా దరఖాస్తులను తిరస్కరించడం సరికాదని పేర్కొంది. కొత్త కోర్సులు, సీట్ల పెంపు అనుమతుల విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం అంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం, కోర్సుల విలీనం, డిమాండ్‌ లేని కోర్సుల్లో సీట్ల తగ్గింపునకు అనుమతి ఇవ్వాలంటూ తాము చేసిన దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించడం చెల్లదని పేర్కొంటూ పలు ఇంజినీరింగ్‌ కాలేజీలో హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి.

వీటిని కొట్టివేసిన సింగిల్‌ జడ్జి.. కొత్త కోర్సులకు అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై సీఎంఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజ్‌, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ఎంజీఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ తదితర ఇంజినీరింగ్‌ కాలేజీలు డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేశారు.

Updated Date - Aug 14 , 2024 | 03:14 AM