మీ ధ్రువపత్రాలు చెల్లవ్
ABN , Publish Date - Nov 08 , 2024 | 02:30 AM
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ కొలువులు పొందిన ఏడుగురు హిందీ పండిట్ల ఆశలు ఉద్యోగంలో చేరిన 20 రోజుల్లోనే అడియాశలయ్యాయి.
ఖమ్మంలో ఏడుగురు హెచ్‌పీటీల తొలగింపు
20 రోజులు విధులు నిర్వహించాక వేటు
రాత్రికి రాత్రే వేరే టీచర్లతో వారి స్థానాల భర్తీ
ఇది అన్యాయం: బాధిత ఉపాధ్యాయులు
ఖమ్మం ఖానాపురం హవేలి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ కొలువులు పొందిన ఏడుగురు హిందీ పండిట్ల ఆశలు ఉద్యోగంలో చేరిన 20 రోజుల్లోనే అడియాశలయ్యాయి. విద్యార్హత సర్టిఫికెట్లు చెల్లవంటూ ఖమ్మం జిల్లాలో ఏడుగురు హిందీ ఉపాధ్యాయులను హఠాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించారు. అంతేనా.. రాత్రికిరాత్రే వారి స్థానాలను వేరే ఉపాధ్యాయులతో భర్తీ చేసేశారు. అయితే, తమ సర్టిఫికెట్లను పరిశీలించి సీఎం చేతులమీదుగా నియామక పత్రాలు ఇప్పించినప్పుడు ఉద్యోగానికి అర్హులైన తాము ఇప్పుడు ఎలా అనర్హులం అయ్యామని.. బాధిత ఉపాధ్యాయులు వాపోతున్నారు.
అసలేం జరిగింది ?
ఖమ్మం జిల్లాలో మొత్తం 10 హిందీ ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నిర్వహించారు. మెరిట్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులైన 9 మందిని ఎంపిక చేశారు. 20 రోజులుగా వీరంతా తమకు కేటాయుంచిన పాఠశాలల్లో పాఠాలు కూడా చెబుతున్నారు. అయితే వీరిలో ఏడుగురు ఉపాధ్యాయులు సమర్పించిన ధ్రువపత్రాలు నిబంధనల ప్రకారం లేవనే కారణంతో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం పాఠశాలలకు విధులకు వెళ్లిన ఆయా హిందీ పండిట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందజేసిన ఉత్తర్వులు చూసి కుదేలైపోయారు. మయూరి నాగేశ్వరరావు (మధిర సీపీఏ పాఠశాల), సట్టు రామలింగయ్య (బనిగండ్లపాడు), షేక్‌నాగుల్‌మీరా (కందూరు జడ్పీహెచ్‌ఎ్‌స), దోర్నాల లావణ్య, (చిలుకూరు జడ్పీహెచ్‌ఎ్‌స), తాటికొండ నాగలక్ష్మి (పాలేరు జడ్పీహెచ్‌ఎ్‌స), తాటికొండ శ్రీదేవి (రేమిడిచర్ల జడ్పీహెచ్‌ఎ్‌స), మొండేటి వెంకటరత్నం (తుమ్మలపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స) ఉద్యోగాలు కోల్పోయారు.
దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మద్రాస్ నుంచి పొందిన డిగ్రీ సర్టిఫికెట్లు చెల్లవని అందుకే వారిని తొలగించినట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఏ సంవత్సరం నుంచి పొందిన సర్టిఫికెట్లను అనుమతించడం లేదో స్పష్టత ఇవ్వడం లేదు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు అవగాహన లోపంతో వాటిని ధ్రువీకరించి, ఉద్యోగాలకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాగా, తొలగించిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తగా ఏడుగురిని నియమించి.. పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. అయితే, ఆయా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఎప్పడు జరిగిందనే సమాచారంపై స్పష్టత లేదు.
న్యాయపోరాటం చేస్తాం..
ఉద్యోగం కోల్పోయిన ఏడుగురు.. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో తాము దక్షిణ భారత హిందీ ప్రచార సభ సర్టిఫికెట్లనే సమర్పించామని తెలిపారు. అప్పుడు వాటిని అనుమతించిన అధికారులు.. ఇప్పుడు చెల్లవని చెబుతూ తమను రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సర్టిఫికెట్లు చెల్లవు
హిందీ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో ఏడుగురి సర్టిఫికెట్లు నిబంధనల ప్రకారం లేవు. సర్టిపికెట్ల పరిశీలనలో విద్యాశాఖ అధికారుల నుంచి తప్పిదం జరిగింది. అభ్యర్థులు సమర్పించిన డిగ్రీకి సంబంధించిన సర్టిపికెట్లపై అనుమానాలు ఉండటంతో వాటిని తిరిగి పరిశీలించాం. అవి చెల్లవని తేలడంతో ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాం. మళ్లీ సర్టిఫికెట్ల పరిశీలన చేసి.. వారి స్థానాల్లో కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చాం.
- సోమశేఖర శర్మ, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి