Share News

Hyderabad: 10 రోజులు.. 731 డెంగీ కేసులు..!

ABN , Publish Date - Aug 27 , 2024 | 10:08 AM

గతంతో పోలిస్తే నగరంలో డెంగీ, చికున్‌ గున్యా(Dengue, Chikungunya) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి 16 మంది చికున్‌ గున్యా బారిన పడ్డారని అధికారిక లెక్కలు చెబుతుంటే.. కూకట్‌పల్లి బాలాజీనగర్‌(Kukatpally Balajinagar)లోని 8 ఫ్లాట్లు గల ఒక్క అపార్ట్‌మెంట్‌లోనే నలుగురు బాధితులు ఉండడం గమనార్హం.

Hyderabad: 10 రోజులు.. 731 డెంగీ కేసులు..!

- మహానగరాన్ని వణికిస్తోన్న దోమలు

- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1143 మందికి డెంగీ

- డెంగీ హాట్‌స్పాట్‌లుగా 404 ప్రాంతాలు

- అధికారికంగానే ఇలా.. అనధికారికంగా మూడు రెట్లు అధికం

- చికున్‌గున్యా కేసుల్లోనూ పెరుగుదల

- గతేడాదితో పోలిస్తే కేసులు తగ్గాయంటోన్న బల్దియా

- అంతకుముందు సంవత్సరాల వివరాలు వెల్లడించని వైనం

- మరణాలు లేవంటూ లోపాలు సమర్ధించుకునే ప్రయత్నం

- దోమల నివారణలో జీహెచ్‌ఎంసీ విఫలం

- ఏఎల్‌ఓ, ఫాగింగ్‌ నామమాత్రమే.. అవగాహన అంతంతే

హైదరాబాద్‌ సిటీ: గతంతో పోలిస్తే నగరంలో డెంగీ, చికున్‌ గున్యా(Dengue, Chikungunya) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి 16 మంది చికున్‌ గున్యా బారిన పడ్డారని అధికారిక లెక్కలు చెబుతుంటే.. కూకట్‌పల్లి బాలాజీనగర్‌(Kukatpally Balajinagar)లోని 8 ఫ్లాట్లు గల ఒక్క అపార్ట్‌మెంట్‌లోనే నలుగురు బాధితులు ఉండడం గమనార్హం. ఈ లెక్కన అనధికారికంగా కేసుల సంఖ్య మూడింతలు అధికంగా ఉండే అవకాశముంది. ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్స్‌లో నమోదవుతోన్న కేసుల్లో చాలా వరకు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావడం లేదు.

ఇదికూడా చదవండి: Hyderabad: అదనపు కోచ్‌లెక్కడ?


ఐదు రోజుల కంటే ముందు నిర్వహించిన పరీక్షల్లో డెంగీ నిర్ధారణ కచ్చితంగా తేలదంటూ ఆ వివరాలను సర్కారీ శాఖలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దోమల నివారణకు యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌(ఏఎల్‌ఓ), ఫాగింగ్‌ నిర్వహిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో దోమల తీవ్రత తగ్గడం లేదు. సాధారణ స్థాయిలో వర్షాలు కురిసినా, దోమలు విజృంభిస్తుండడం ఆందోళనకంగా ఉన్నదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీజనల్‌ వ్యాధులూ క్రమంగా పెరుగుతున్నాయి.


దోమల నివారణ గాలికి..

గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. పలు ప్రాంతాల్లో నిత్యం రోడ్లు ఊడిచే పరిస్థితి కూడా లేదు. ప్రైవేట్‌ ఏజెన్సీకి చెత్త తరలింపు బాధ్యతలు అప్పగించిన జీహెచ్‌ఎంసీ ఆ సంస్థ పనితీరును పర్యవేక్షిస్తోన్న దాఖలాలు లేవు. దీంతో వాళ్లు తీసుకెళ్లిందే చెత్త అన్నట్టు తయారైంది పరిస్థితి. నగరంలో ఎక్కడికక్కడ వ్యర్థాల కుప్పలు పేరుకుపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రజావాణి, కాల్‌ సెంటర్‌, మొబైల్‌ యాప్‌నకు గతంతో పోలిస్తే అధిక సంఖ్యలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ చెత్త ఎత్తే పరిస్థితి లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో ఏఎంసీ, ఏఎంఓహెచ్‌, డీసీలు ఉదయం 6 గంటలకే రోడ్లపైకి వచ్చే వారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.


city2.jpg

జోనల్‌ కమిషనర్లు, కీలక అధికారులు టెలి కాన్ఫరెన్స్‌లకే పరిమితమవుతుండడంతో క్షేత్రస్థాయి పనితీరు గాడి తప్పింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వాటర్‌బోర్డు తీరుతో రోజుల తరబడి మురుగు రహదారులపై పారుతోంది. ఇది కూడా అపరిశుభ్రతకూ ఓ కారణం. పలు ప్రాంతాల్లో తవ్వి వదిలేసిన సెల్లార్‌లు, కుంటల్లో వరద నీరు నిలిచి దోమల వృద్ధికి కారణమవుతోంది. వీటిలో క్రమం తప్పకుండా రసాయనాలు పిచికారి చేయకపోవడం వల్లే ఈ దుస్థితి అని స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది వేతనాలు, ఏఎల్‌ఓ, ఫాగింగ్‌ కోసం రసాయనాలు, డీజిల్‌ తదితరాలకు యేటా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా నానాటికి పరిస్థితులు తీసికట్టుగా మారుతున్నాయి.


గతం కంటే తక్కువంటూ..

బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ అధ్వానం. పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు ఫొటో స్టంట్‌లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు పరిమితమవుతోంది. దీంతో చాలా మందికి దోమల నివారణకు ఏం చేయాలన్నది తెలియడం లేదు. పలు కుటుంబాలు డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని నిల్వ చేసుకొని వాడుతుంటాయి. వారం కంటే ఎక్కువ రోజులు వాటిని శుభ్రం చేయకుంటే లార్వా వృద్ధి చెంది దోమలు పెరుగుతాయి. ఈ విషయం తెలియకపోవడంతో ఆ కుటుంబాలు దోమ కారక వ్యాధుల బారినపడుతున్నాయి.


అయినా గతేడాది కంటే డెంగీ కేసులు తక్కువగా ఉన్నాయని.. మరణాలూ లేవని జీహెచ్‌ఎంసీ అధికారులు తమ లోపాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2023 ఆగస్టు వరకు 1825 కేసులు డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ యేడాది 1143 కేసులు మాత్రమే నమోదయ్యాయని జీహెచ్‌ఎంసీ ఆదివారం ప్రకటించింది. అదే సమయంలో 2020, 2021, 2022లో నమోదైన కేసుల వివరాలను మాత్రం వెల్లడించ లేదు. అంతకుముందు సంవత్సరాల్లో ప్రస్తుతం నమోదైన దాని కంటే తక్కువ కేసులు నమోదు కావడమే ఇందుకు కారణం.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2024 | 10:08 AM