AV Ranganath: అనుమతులుంటే.. కూల్చం!
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:51 AM
భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
సీఎం ఆదేశాలను అమలు చేస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన
ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో స్పష్టత
అనుమతుల్లేని వాటినే కూల్చామని వెల్లడి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అన్ని రకాల అనుమతులు పొంది నిర్మించిన నిర్మాణాలకు కూల్చివేతల భయం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలపై హైడ్రా కమిషనర్ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉందని ఆదివారం ఓ ప్రకటన చేశారు. చెరువుల పక్కనున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురువుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటిదాకా హైడ్రా కూల్చేసిన నిర్మాణాలన్నీ అనుమతులు లేకుండా నిర్మించినవేనని చెప్పారు. దుండిగల్, మల్లంపేట, అమీన్‌పూర్‌లో అనుమతులు ఇచ్చిన అనంతరం అవి ప్రభుత్వ స్థలాలని తెలిసి వాటిని రద్దు చేశారని, కానీ డెవలపర్లు నిర్మాణాలు చేపట్టి విక్రయించడంతో కూల్చివేశామని వివరించారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ప్రజలు నివసిస్తోన్న భవనాల జోలికి వెళ్లమని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చెల్లుబాటయ్యే అనుమతులతో నిర్మిస్తోన్న భవనాలను ఇక నుంచి కూల్చేది లేదని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా చేపడుతోన్న నిర్మాణాల విషయంలో మాత్రం చట్ట ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు ఇకపై అనుమతులివ్వకుండా చూస్తామని, కొత్త నిర్మాణాలు రాకుండా నిఘా పెడతామని తెలిపారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరుగుతోందని, సమగ్ర వివరాల సేకరణ అనంతరం తదుపరి చర్యలుంటాయని రంగనాథ్ చెప్పారు. కాగా, చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో హైడ్రా కూల్చివేసిన భవనాల్లో అధిక భాగం డెవలపర్లు నిర్మించి సాధారణ పౌరులకు విక్రయించినవే. ఇందులో కొన్ని అనుమతులు ఉన్నవి కాగా.. ఇంకొన్ని అనుమతులిచ్చి అనంతరం రద్దు చేసినవి. కొన్ని నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు.
ఇందులో అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చివేయడంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, చెరువుల వద్ద ఉన్నా అనుమతులుంటే ఆ నిర్మాణాలను కూల్చమని హైడ్రా తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో పర్మిషన్ ఉన్నా కూల్చివేతలు చేపట్టడంతో నష్టపోయిన సామాన్యుల పరిస్థితి ఏంటి ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి ఏదైనా నిర్మాణానికి అనుమతులిచ్చి రద్దు చేస్తే... నిర్మాణ పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. కానీ, నిర్మాణదారులతో కుమ్మక్కైన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అనుమతుల రద్దు సంగతి తెలియక, పాత పత్రాలను చూసి ఇళ్లు కొనుగోళ్లు చేసిన వారు ఇప్పుడు నష్టపోయారు. ఈ బాధితుల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.