Share News

Hyderabad: ‘మహా’ టీడీఆర్‌ బ్యాంక్‌.. అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్‌ఎండీఏ

ABN , Publish Date - Jul 20 , 2024 | 10:29 AM

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ట్రాన్స్‌ఫర్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) బ్యాంకును ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన టీడీఆర్‌ బ్యాంకు(TDR Bank) భూ నిర్వాసితులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.

Hyderabad: ‘మహా’ టీడీఆర్‌ బ్యాంక్‌.. అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్‌ఎండీఏ

- వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ప్లాట్‌ఫామ్‌ రూపకల్పన

- డిజిటలైజ్‌ టీడీఆర్‌, లెడ్జర్‌ సైతం ఏర్పాటు

- పారదర్శకంగా జారీ.. క్రయవిక్రయాలకు అవకాశం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ట్రాన్స్‌ఫర్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) బ్యాంకును ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన టీడీఆర్‌ బ్యాంకు(TDR Bank) భూ నిర్వాసితులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. భూ సేకరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి భూమికి రెట్టింపు లేదా నాలుగు రెట్ల భూమిని పరిహారంగా టీడీఆర్‌ సర్టిఫికెట్‌ రూపంలో అందజేస్తున్నారు. ఇలా సర్టిఫికెట్‌ రూపంలో వచ్చిన టీడీఆర్‌ను భూయజమాని గజాల రూపంలో అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ తరహాలోనే హెచ్‌ఎండీఏ కూడా భూ నిర్వాసితులకు టీడీఆర్‌లను జారీ చేస్తోంది. టీడీఆర్‌ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచడం, క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా టీడీఆర్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి గురువారం రాత్రి నుంచి అందుబాటులోకి తెచ్చింది.

ఇదికూడా చదవండి: Hyderabad: నియో.. కుయ్యో మొర్రో...


హైదరాబాద్‌ మహానగర విస్తరణలో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ నిధులు భూసేకరణకు అవసరమవుతాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం టీడీఆర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానాన్ని ఎనిమిదేళ్ల క్రితమే జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టింది. టీడీఆర్‌ సర్టిఫికెట్ల(TDR Certificates) జారీలో పారదర్శకతతో పాటు ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలకు అవకాశం కల్పించడానికి జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌ బ్యాంకును ఏర్పాటు చేసింది. అయితే హెచ్‌ఎండీఏ సైతం ఈ విధానాన్ని అమలులోకి తెస్తోంది. తన పరిధిలోని నగర శివారు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, జంక్షన్లు, రోడ్ల విస్తరణ చేపడుతున్న క్రమంలో పెద్దఎత్తున భూసేకరణ చేస్తున్నారు. భూ నిర్వాసితులకు పరిహారంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో టీడీఆర్‌ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. కోల్పోయిన స్థలానికి మార్కెట్‌ ధరకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు రెట్ల వరకు ఈ టీడీఆర్‌లు ఉంటున్నాయి. గ్రామకంఠం భూములకు 200శాతం, రిజిస్ర్టేషన్‌ భూమికి 400 శాతం టీడీఆర్‌ రూపంలో పరిహారంగా ఇస్తారు. ఈ టీడీఆర్‌ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం, భూ నిర్వాసితులు క్రయవిక్రయాలు జరుపుకునేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో టీడీఆర్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్‌ సర్టిఫికెట్లన్నింటినీ ఇక నుంచి వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు.


క్రయ, విక్రయాలకు అవకాశం

హెచ్‌ఎండీఏలో టీడీఆర్‌ సర్టిఫికెట్లకు చాలా డిమాండ్‌ ఉన్నది. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే డెవలపర్లకు, బిల్డర్లకు ఈ టీడీఆర్‌ సర్టిఫికెట్లతో అదనంగా మరో అంతస్తు నిర్మించుకోవడానికి అవకాశముంటుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రస్తుతం ఏడు అంతస్తుల నుంచి 58అంతస్తుల వరకు అనుమతులు పొందుతున్నారు. ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్న హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో డెవలపర్‌ అంచనా వేసుకున్న దాని కంటే మరో అంతస్తు నిర్మాణానికి టీడీఆర్‌ సర్టిఫికెట్‌ ఉంటే అనుమతులు వస్తాయి. ఓ భూ నిర్వాసితుడి దగ్గర రూ.1500ల విలువ చేసే టీడీఆర్‌ ఉంటే రూ.500 చొప్పున ముగ్గురికి విక్రయించవచ్చు. మొత్తం ఒక్కరికైనా విక్రయించుకునే అవకాశమున్నది. భూ నిర్వాసితుడి టీడీఆర్‌ లెడ్జర్‌ కూడా హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోనే ఉంటుంది. అందులోనే క్రయ విక్రయదారుల వివరాలన్నీ ఉంటాయి. టీడీఆర్‌ జారీలో పారదర్శకత ఉంటుంది.


ఆ ప్రాజెక్టులకు దోహదపడే అవకాశం

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో త్వరలోనే భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌ల నుంచి రెండు మార్గాల్లో ఎలివేటెడ్‌ కారిడార్లను ప్రతిపాదించింది. అయితే డిఫెన్స్‌ భూములను మినహాయించి ప్యారడైజ్‌ నుంచి కొంపల్లి మార్గంలో 8.41ఎకరాలు, సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట వరకు 83.72ఎకరాల వరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించాల్సి ఉన్నది. మీరాలం చెరువుపై చింతల్‌మెట్‌ నుంచి బెంగళూర్‌ వైపు వెళ్లే రోడ్డు వరకు 2.5కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ నిర్మాణంలో కూడా చాలా వరకు ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉన్నది. ఈ మూడు భారీ ప్రాజెక్టుల్లోని ప్రైవేటు భూములకు పూర్తిగా టీడీఆర్‌ను జారీ చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మియాపూర్‌ నుంచి గండిమైసమ్మ మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణకు, శివారు ప్రాంతాలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా రోడ్ల విస్తరణ చేస్తుండడంతో భూ నిర్వాసితులకు టీడీఆర్‌లను జారీ చేయనున్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 10:29 AM