Share News

KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:14 AM

కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల చిక్కులు లేని ప్రయాణం.. వంతెనల మీదుగా.. సొరంగాల గుండా సాఫీగా వెళ్లే అవకాశం.. హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌(కేబీఆర్‌) చుట్టూ త్వరలో సాకారం కానుంది.

KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

  • కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నిర్మాణాలకు ఓకే

  • పాలనా పరమైన అనుమతులిచ్చిన సర్కార్‌

  • 826 కోట్ల అంచనాతో 2 దశల్లో పనులు

  • సొరంగాల్లో నీరు నిలువకుండా చర్యలు

  • టెండర్‌కు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల చిక్కులు లేని ప్రయాణం.. వంతెనల మీదుగా.. సొరంగాల గుండా సాఫీగా వెళ్లే అవకాశం.. హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌(కేబీఆర్‌) చుట్టూ త్వరలో సాకారం కానుంది. ఆరు చౌరస్తాల్లో ఏడు వంతెనలు, ఏడు అండర్‌పా్‌సల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. శుక్రవారం పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌-సిటీ)లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు చేయనుంది.


త్వరలో టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం సిద్ధమవుతోంది. రూ.826 కోట్లతో ప్రతిపాదించిన పనులను ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విధానంలో రెండు ప్యాకేజీలుగా విభజించారు. రూ.421 కోట్లతో మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ ప్రవేశం, ముగ్ధ కూడళ్ల వద్ద, రెండో దశలో రూ.401 కోట్లతో రోడ్‌ నం.45, ఫిలింనగర్‌, మహారాజ అగ్రసేన్‌, క్యాన్సర్‌ ఆస్పత్రి, కేబీఆర్‌ పార్క్‌ కూడళ్ల వద్ద వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.


  • గత ప్రతిపాదనలను తలదన్నేలా..

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) ఫేజ్‌-2లో భాగంగా ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులను తలదన్నేలా బహుళ ప్రయోజనకరంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. దీంతో అక్కడి రహదారుల స్వరూపం పూర్తిగా మారనుంది. పర్యావరణ ఇబ్బందులు లేకుండా కేబీఆర్‌ పార్క్‌ భూగర్భం నుంచి అండర్‌పా్‌సలను ప్రతిపాదించారు. సొరంగ మార్గాల్లో వాన నీరు నిలవకుండా ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయని పేర్కొన్నారు. పనుల తీరు, నాణ్యత పర్యవేక్షణ కోసం ఏజెన్సీ ఎంపికకు టెండర్‌ పిలవాలని సూచించారు.


ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కూడళ్లలో రూ.586కోట్లతో వంతెనలు, గ్రేడ్‌ సెపరేటర్ల నిర్మాణానికి అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి ఏజెన్సీని ఎంపిక చేసిన అనంతరం.. జాతీయ పార్క్‌ అయిన కేబీఆర్‌పై ప్రభావం పడుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని పలు సంస్థలు ఎన్‌జీటీని ఆశ్రయించాయి. దీంతో ముందడుగు పడలేదు. అయితే, ఆ ప్రణాళికలను సవరించి అండర్‌పా్‌సలూ నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Oct 05 , 2024 | 04:14 AM