Cyber Crimes: ఒక్క అక్షరంతో ఏమార్చి.. దడ పుట్టిస్తున్న ఫిషింగ్ నేరాలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 07:07 AM
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. నగదుకు సంబంధించిన లావాదేవీలన్నీ దాదాపుగా డిజిటల్ రూపంలోనే సాగుతున్నాయి. దీనిని అవకాశంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
కొత్తపేట, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. నగదుకు సంబంధించిన లావాదేవీలన్నీ దాదాపుగా డిజిటల్ రూపంలోనే సాగుతున్నాయి. దీనిని అవకాశంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తోన్న ఫిషింగ్
ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోన్న ఆధునిక సైబర్ నేరం ఫిషింగ్. ఈ–మెయిల్, ఫోన్ కాల్, మెసేజ్ తదితర విధానాల ద్వారా యూజర్‌నేమ్, పాస్వర్డ్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ వంటి వాటి గురించి సమాచారం తెలుసుకోవడమే ఫిషింగ్. బ్యాంకుల హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని.. సాంకేతిక కారణల వల్ల డెబిట్/క్రెడిట్ కార్డు పిన్ నంబర్ మార్చేస్తున్నామని.. వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని కోరతారు. సంబంధిత బ్యాంక్ అధికారిక ఈ–మెయిల్ మాదిరిగానే నకిలీ మెయిల్/వెబ్‌సైట్‌ను సృష్టించి మెసేజ్‌లు పంపి నమ్మేలా చేస్తారు. మన వివరాలు తెలుసుకుని ఖాతాలోని డబ్బు మాయం చేస్తారు.
రాచకొండలోనే 89 కేసులు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు 89 ఫిషింగ్ కేసులు నమోదయ్యాయి. 14 కేసులను మాత్రమే పోలీసులు ఛేదించగలిగారు. అపరిచితుల నుంచి వచ్చే ఈ మెయిల్స్/మెసేజ్‌లకు స్పందించవద్దని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. లాటరీలో ప్రైజ్ మనీ వచ్చిందని, ఏటీఎం క్రెడిట్ కార్డు పిన్ వెరిఫికేషన్ పేరుతో మోసం చేసే ప్రమాదం ఉందని.. అనుమానం వస్తే బ్యాంకు అధికారులను సంప్రదించాలని చెబుతున్నారు. ఫేక్ వెబ్సైట్లను గమనిస్తేనిజమైన వెబ్సైట్లా కనిపిస్తుందని, కానీ ఒక అక్షరం తప్పు గా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు
కేంద్ర కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగం సీ డాక్ హైదరాబాద్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ) ప్రాజెక్ట్ నిపుణులు నిత్యం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వెబ్ పోస్టర్లు, వీడియోలు రూపొందిస్తున్నారు. రాచకొండ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో సైబర్ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంది. ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి సైబర్ నేరగాళ్లను కటకటాల్లోకి పంపిస్తున్నారు.
ఫిషింగ్ వెబ్సైట్లలో కొన్ని..
www.gmai1.com, www.icici6ank.com, www.bank0findia.com, www.yah00.com, www.eci.nic.ni, www.electoralsearching.in
అవగాహనతోనే అడ్డుకట్ట
అవగాహనతోనే ఫిషింగ్ నేరాలను నియంత్రించగలం. సైబర్ నేరాలను ఛేదించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాం. గుర్తు తెలియని వెబ్సైట్లను, లింకులను ఓపెన్ చేయొద్దు. ఆన్లైన్ కొనుగోళ్లు, విక్రయాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సైబర్ నేరాలు, నివారణ చర్యలపై సమాచారం కోసం https://dnisea.app వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
– సీహెచ్‌ఏఎస్ మూర్తి, సీనియర్ డైరెక్టర్, సీ డాక్ హైదరాబాద్